బరువు తగ్గాలని అనుకునే వారికి కఠినమైన వ్యాయామాలు, ఖరీదైన జిమ్‌లు తప్పనిసరి కాదు. రోజువారీ జీవితంలో చిన్న మార్పులతోనే ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చు. అందులో ముఖ్యమైనది నడక. రోజుకు కేవలం ఒక కిలోమీటరు నడవడం కూడా శరీరానికి ఉపయోగకరమని నిపుణులు చెబుతున్నారు. ఇది సులభంగా అలవాటు చేసుకునే వ్యాయామం కావడం ప్రత్యేకత.

సాధారణంగా ఒక కిలోమీటరు నడిస్తే సుమారు 60 నుంచి 100 కేలరీలు ఖర్చవుతాయి. ఇది వ్యక్తి బరువు, వేగం, శరీర నిర్మాణం ఆధారంగా మారుతుంది. వేగంగా నడిస్తే మరింత కేలరీలు కరుగుతాయి. క్రమం తప్పకుండా నడకను అలవాటు చేసుకుంటే నెలరోజుల్లోనే గణనీయమైన ఫలితాలు కనిపిస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
నడక వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. అదనంగా ఒత్తిడి తగ్గి, మానసిక ప్రశాంతత పెరుగుతుంది. రోజూ నడిచే అలవాటు నిద్ర నాణ్యతను కూడా మెరుగుపరుస్తుంది.
జీర్ణవ్యవస్థ పనితీరు సక్రమంగా ఉండేందుకు నడక సహాయపడుతుంది. మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. కేవలం నడకతోనే బరువు పూర్తిగా తగ్గకపోయినా, సరైన ఆహారంతో కలిపి చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. చిన్న అలవాటే అయినా దీన్ని నిరంతరం కొనసాగిస్తే ఆరోగ్యంపై దీర్ఘకాల ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.





























