దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాలు అధికం అవుతున్న నేపథ్యంలో కరోనా శవాలకు అంత్యక్రియలు నిర్వహించడానికి స్మశాన వాటికలో స్థలం లేకపోవడంతో ఎన్నో మృతదేహాలు గంగానదిలో కొట్టుకు వస్తున్న ఘటన చోటుచేసుకుంది. ఇప్పటికి కూడా గంగానది ఒడ్డుకు మృతదేహాలు కొట్టుకునే వస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఈ విధంగా ఒడ్డుకు కొట్టుకు వచ్చిన మృతదేహాలు పట్ల ఉత్తరప్రదేశ్లో అమానవీయ చోటు చేసుకుంది.

యూపీలోని బలియాలో గంగానది ఒడ్డుకు కొట్టుకు వచ్చిన మృతదేహాన్నికోవిడ్ మృతదేహంగా భావించి అక్కడ ఉన్న స్థానికులు ఆ శవాన్ని కట్టెలపై ఉంచి పెట్రోల్, టైర్లు వేసి దహనం చేశారు. అయితే ఈ ఘటన ఐదుగురు పోలీసుల సమక్షంలో జరగడంతో ఈ విషయం పెద్ద చర్చనీయాంశంగా మారింది.ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
గంగా నది ఒడ్డుకు కొట్టుకు వచ్చిన కరోనా మృతదేహాలకు గౌరవప్రదంగా అంత్యక్రియలు జరిపించాలని,అందుకు తగిన ఆర్థిక సహాయం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేస్తుందని ఇదివరకే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపినప్పటికీ, పోలీస్ అధికారులు ఎంతో బాధ్యతారహితంగా మృతదేహం పట్ల ఈ విధంగా వ్యవహరించడంతో అధికారులు ఆ అయిదుగురు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిపై సస్పెన్షన్ వేటు వేశారు.
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికీ కూడా గంగానది ఒడ్డుకు మృతదేహాలు కొట్టుకు వస్తున్నాయని, ఈ విధంగా మృతదేహాలు నీటిలో కలపడం వల్ల నీరు కలుషితంగా మారి మరి కొన్ని కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉందని, నీటి ద్వారా ప్రజల ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.































