Floods effect in Telangana : గత కొద్ది రోజులుగా కురుస్తున్న వానలకు తెలంగాణ చిగురుటాకులా వణికింది. ఒకవైపు రాజధాని నగరంలో ఎక్కడికక్కడ ముంపు ఏర్పడి ట్రాఫిక్ కష్టాలతో జనాలు ఇబ్బంది పడితే మరోవైపు పల్లెలు ఆకస్మాత్తుగా వచ్చిన వరదకు అతలాకుతలం అయ్యాయి. భూపాలపల్లి జిల్లా మోరంచపల్లిలో వరద బీభత్సానికి ఊరు ఊరే మునిగిపోయింది. ఇల్లు సామాను అన్నీ నీటి పాలై స్థానికులు కన్నీటి పర్యంతం అయ్యారు.

చూస్తున్నట్లుగానే జనాలు, పశువులు కొట్టుకుపోయాయి…
భారీగా కుండపోత వాన కురవడంతో మోరంచ వాగు ఉప్పొంగడంతో ఒక్కసారిగా గ్రామంలోకి నీరు చేరింది. అందరూ నిద్ర పోతున్న సమయంలో తెల్లవారుజామున 4:27 నిమిషాల నుండి 4:50 నిమిషాల సమయంలో ఒక్కసారిగా ఉదృతంగా నీరు రావడంతో అందరూ భయంతో పరుగులు తీశారు. కట్టుబట్టలతో చెట్లను ఎక్కి ప్రాణాలను కాపాడుకున్నారు. కొంతమంది వరదలో కొట్టుకుపోయారు. పశువులు కూడా కొట్టుకుపోయాయి.

ఇప్పటికీ కొట్టుకు పోయిన వారి ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. భర్త పోయి ఒకరు, భార్య పోయి ఒకరు, అమ్మ పోయి ఒకరు, కూతురు పోయి ఒకరు ఇలా ఒక్కో కుటుంబాన్ని కదిలిస్తే ఒక్కో విషాద గాధ వినిపిస్తోంది. ప్రభుత్వం నుండి ముందస్తు హెచ్చరికలు రాలేదని ఒక్కసారిగా వరద పోటెత్తడం, సుమారు 17 అడుగుల మేర నీరు రావడంతో ఊరు మొత్తం తుడిచిపెట్టుకుపోయింది అంటూ స్థానికులు బాధపడుతున్నారు. ఇది మాకు పునర్జన్మలాగా అనిపిస్తుంది. మాకిక ఈ ఊరు వద్దు వేరే ఎక్కడైనా ప్రభుత్వం స్థలం చూపిస్తే వెళ్ళిపోతాం అంటూ రోధిస్తున్నారు.