సాంకేతికంగా ప్రపంచం ఎంతో అభివృద్ధి చెంది ముందుకు సాగుతున్న రోజులలో కూడా కొందరు అమాయక ప్రజలు మాయ మాటలు నమ్మి పెద్దఎత్తున మోసపోతుంటారు. ఈ మధ్యకాలంలో అమాయక ప్రజలను ఆసరాగా చేసుకుని కొత్త తరహా మోసాలకు నేరగాళ్లు తెర లేపుతున్నారు. లాటరీ, చిట్టి పాటలు పాడుతూ ప్రజల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసి వారికి మోసం చేస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఇలాంటి సంఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది.

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారానికి కొద్ది సంవత్సరాల క్రితం వచ్చిన ఓ వ్యక్తి అద్దె ఇంట్లో ఉంటూ ఆయుర్వేద వైద్యుడిగా చలామణి అయ్యాడు.ఈ క్రమంలోనే చిన్నచిన్న స్కీమ్ లను నిర్వహిస్తూ ఆ పరిసర ప్రాంతాలలో బాగా పరిచయాలు ఏర్పరుచుకున్నాడు. ప్రతినెల ఐదు వందల రూపాయల స్కీమ్ కడితే ఆరు నెలల వరకు విజేతలకు టీవీలు, మిక్సీలు వంటి బహుమతులను అందజేశాడు.చివరిదైన ఏడో నెల నిర్వహించే డ్రాలో బంపర్ బహుమతులతో పాటు మిగిలిన అందరికీ తప్పనిసరి బహుమతులు వస్తాయని అందరిని నమ్మించాడు.
ఈ క్రమంలోనే కొందరు విజేతలకు టీవీలు వంటి బహుమతులు అందజేసి అతనిపై నమ్మకం ఏర్పరచుకున్నాడు. అదే విధంగా ప్రజలు కూడా అతని నమ్మడంతో మరో 3వేల రూపాయల కొత్త స్కీమ్ ను ప్రారంభించాడు. ఆ స్కీమ్ లో కూడా విజేతలకు బహుమతులు చెల్లిస్తానని చెప్పడంతో 500 స్కీమ్ కట్టిన వారు కూడా మూడు వేల రూపాయల స్కీమ్ కట్టారు.
అనుకున్న విధంగానే అందరితో డబ్బులు చెల్లించుకుని ఏప్రిల్ 30వ తేదీన డ్రా తీస్తానని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే వాయిదాలు చెల్లించిన వారు ఇతరుల దగ్గర వాయిదాలు చెల్లించారు. ఈ విధంగా ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులను కట్టించుకొని రాత్రికి రాత్రే ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. దీంతో స్కీమ్ కట్టిన వారు మోసపోయామని భావించి లబోదిబోమంటున్నారు. ఈవిధంగా బాధితులకు సుమారు రెండు కోట్ల వరకు టోకరా పెట్టినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఈ విషయం ధర్మారం, వెల్గటూరు మండలాల్లో చర్చనీయాంశంగా మారింది.అయితే ఈ విషయంపై తమకు ఎటువంటి ఫిర్యాదు రాలేదని ఫిర్యాదు వస్తే తప్పకుండా దర్యాప్తు కొనసాగిస్తామని పోలీసులు వెల్లడించారు.






























