2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని రాజమహేంద్రవరంలో ప్రభుత్వం ముందస్తు చర్యలు ప్రారంభించింది. ఈ మహోత్సవానికి భారీగా భక్తులు రానున్న నేపథ్యంలో ఆలయాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణపై దృష్టి సారించారు. తొలి దశలో భాగంగా పట్టణంలోని ముఖ్య దేవాలయాల సుందరీకరణ పనులు చేపట్టారు.

ప్రభుత్వం ఇప్పటికే పలు సమీక్ష సమావేశాలు నిర్వహించి పుష్కరాల కోసం సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసింది. మొత్తం 43 ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించగా, పలు నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా స్నాన ఘట్టాల విస్తరణ, భక్తులకు సౌకర్యాలు కల్పించడం ప్రధాన లక్ష్యంగా పనులు సాగుతున్నాయి.
గోదావరి తీరం వెంట ఉన్న ప్రాంతాల్లో మౌలిక వసతులను మెరుగుపరచడానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. లక్షలాది కాదు, కోట్లాది భక్తులు పాల్గొనే ఈ వేడుకలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, రవాణా, భద్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి కలిగించేలా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్రంతో సమన్వయం చేస్తూ పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమిష్టిగా పనిచేస్తున్నాయి.



























