టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. హీరో రాజశేఖర్ కు పితృ వియోగం కలిగింది. హీరో రాజశేఖర్ తండ్రి వరదరాజన్ గోపాల్ గత కొద్ది రోజుల నుంచి తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే అతనిని మెరుగైన చికిత్స కోసం సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వరదరాజన్ కన్నుమూశారు. వరదరాజన్ గోపాల్ వృత్తిపరంగా చెన్నై డిఎస్పీగా పదవి విరమణ పొందారు. ఈయనకు ఐదు మంది సంతానం కాగా వారిలో హీరో రాజశేఖర్ రెండో అబ్బాయి.ఇక హీరో రాజశేఖర్ తండ్రి మరణవార్త తెలిసిన పలువురు ప్రముఖులు ఆయన మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు.
శుక్రవారం ఉదయం ఆయన భౌతిక కాయాన్ని చెన్నైకి తరలించినట్లు అతని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఇక వరదరాజన్ గోపాల్ అంత్యక్రియలు కూడా చెన్నైలోనే జరుగనున్నట్లు రాజశేఖర్ కుటుంబ సభ్యులు తెలియజేశారు. వరదరాజన్ గోపాల్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు రాజశేఖర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
గతంలో రాజశేఖర్ తండ్రి డిఎస్పీగా విధులు నిర్వర్తించడం వల్ల ఆయన భౌతిక కాయానికి చెన్నై ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయన అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు.
































