1993 సంవత్సరం దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో ఈ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ నాగార్జున కాంబినేషన్ లో వారసుడు మూవీ విజయవంతమయ్యింది. ఆ సందర్భంగా నాగార్జున గారిని అభినందించడానికి వెళ్ళిన ఈ.వి.వి. సత్యనారాయణ తో మన కాంబినేషన్ లో మరో కొత్త మూవీ చేద్దాం కథ తయారు చేయండని నాగార్జున గారు చెప్పారు. అప్పుడు ఈ.వి.వి. సత్యనారాయణ హాలీవుడ్ చిత్రం ట్విన్స్ ‘డ్రాగన్స్’ చిత్రాన్ని రీమేక్ చేద్దామనుకున్నారు. ఆ క్రమంలో రచయితలు రమణి, ఎల్బీ శ్రీరామ్ లను సంప్రదించగా మాస్, క్లాసు మధ్యలో కామెడీ అన్నట్టుగా కథ తయారు చేసుకున్నారు. అది విన్న నాగార్జున దుర్గా ఆర్ట్స్ అధినేత K.L నారాయణతో చెప్పి సినిమా ఓకే చేయించారు.

డబుల్ యాక్షన్ సినిమాలు ఇంతకు ముందు ఎన్నో వచ్చాయి. కానీ ట్విన్స్ లో ఒకరికి బాధ, సంతోషం కలిగితే మరొకరు ప్రతిస్పందించడం అనేది కొత్తగా కనిపించింది. ద్విపాత్రాభినయం చేసే నాగార్జున సరసన రమ్యకృష్ణ సౌందర్య లను హీరోయిన్లుగా తీసుకున్నారు. అప్పటివరకు స్టార్ హీరోలతో చేయని సౌందర్య కు ఈ సినిమాతో ఆలోటు తీరింది. అలనాటి ప్రముఖ విలన్ రాజనాల ను చిత్ర పరిశ్రమ మరిచిపోతున్న తరుణంలో ఈ సినిమాలో ఓ మంచి వేషం ఇచ్చారు. ప్రతీ కథానాయకుడి పాత్రలో తమిళనటుడు నెపోలియన్ కొత్తగా కనిపించడం జరిగింది.

అన్నిటినీ మించి కోట శ్రీనివాసరావు మల్లికార్జున్ ల మధ్య వచ్చే కామెడీ ట్రాక్ సినిమాని మరో ఎత్తుకు తీసుకెళ్ళింది. వారిద్దరూ కామెడీ చేస్తూ చివరికి ట్రాజెడీ గా చేయడం ప్రేక్షకులను మరింత సినిమాకు కనెక్ట్ అయ్యేలా చేసింది. అయితే సినిమాలో అక్కడ అక్కడ ట్విన్స్ నాగార్జునలు ఒకే ఫ్రేమ్ లో కనబడటంతో మరొక నాగార్జున పాత్రలో ప్రముఖ నటుడు హీరో శ్రీకాంత్ నటించడం జరిగింది. ఆ విధంగా కొత్త తరహా అంశంతో వచ్చిన హలో బ్రదర్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.






























