హైదరాబాద్: పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నిర్మాత ఏఎం రత్నం చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించాయి. ఈ చిత్రం తన కెరీర్‌లో ఎంతో ప్రత్యేకమైనదని ఆయన పేర్కొన్నారు.

“పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక విడుదలవుతున్న తొలి సినిమా”
ఏఎం రత్నం మాట్లాడుతూ, “నేను చాలా సినిమాలు నిర్మించాను కానీ హరిహర వీరమల్లు నాకు ఎంతో ప్రత్యేకమైన చిత్రం. ఎందుకంటే ఇది పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విడుదలవుతున్న తొలి సినిమా. అందుకే ఇది నా కెరీర్‌లో మరపురాని ఘట్టంగా నిలుస్తుంది” అని చెప్పారు.
చారిత్రక నేపథ్యం, పవన్ పాన్ ఇండియా ఎంట్రీ
ఇక ఈ సినిమా కథ, కంటెంట్ గురించి మాట్లాడుతూ.. “ఇది ఖుషీ లాంటి రొమాంటిక్ ఎంటర్టైనర్ కాదు. హిస్టారికల్ నేపథ్యంతో తెరకెక్కుతున్న చిత్రమిది. ఇదే మొదటిసారి పవన్ కళ్యాణ్ గారు పాన్ ఇండియా స్థాయిలో నటిస్తున్న హిస్టారికల్ ఫిల్మ్. ఈ సినిమాను నిర్మించడం నాకు గర్వంగా ఉంది” అని తెలిపారు.
“పవన్ కళ్యాణ్ విశ్వరూపం చూస్తారు”
“ఈ సినిమా కేవలం కమర్షియల్ ఎంటర్టైనర్ మాత్రమే కాదు. ఒక సమకాలీన చారిత్రక అంశాన్ని ఆధారంగా తీసుకుని రూపొందించిన చిత్రమిది. సినిమా చూశాకా ఆ కాలం గురించి, జరిగిన సంఘటనల గురించి ప్రేక్షకులు ఆలోచించక తప్పదు. ఏదైనా మంచి సినిమా ఓ మెసేజ్ ఇవ్వాలని నా నమ్మకం. ఈ సినిమాలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి విశ్వరూపాన్ని మీరు చూస్తారు. ఆయన్ను పూర్తిగా కొత్తగా, శక్తివంతంగా మీరు స్క్రీన్ మీద చూడబోతున్నారు” అంటూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.
ఈ చిత్రం జులై 24న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ప్రముఖ దర్శకులు క్రిష్ మరియు జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కగా, నిధి అగర్వాల్ కథానాయికగా నటించారు. పవన్ అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.































