సోషల్ మీడియాలో రోజురోజుకు నకిలీ వీడియోలు, ఫేక్ పథకాల ప్రచారం పెరుగుతోంది. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ పేరుతో “ప్రతి ఆధార్ కార్డు ఉన్న వ్యక్తికి ఉచిత ఎలక్ట్రిక్ సైకిల్” అంటూ ప్రచారంలోకి వచ్చిన వీడియో పెద్ద ఎత్తున వైరల్ అయింది. వీడియోలో మోదీ స్వయంగా ఈ పథకాన్ని ప్రకటిస్తున్నట్టుగా చూపించడంతో చాలామంది దీనిని నిజమని నమ్మి షేర్ చేస్తున్నారు.

అయితే ఈ వీడియోపై కేంద్ర ప్రభుత్వ అధికారిక సంస్థ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) స్పందించింది. ఫ్యాక్ట్ చెక్ నిర్వహించిన అనంతరం ఇది పూర్తిగా నకిలీ వీడియో అని స్పష్టం చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్‌ఫేక్ టెక్నాలజీ సహాయంతో ప్రధాని మోదీ స్వరాన్ని, వీడియో క్లిప్‌లను మార్పులు చేసి ఈ తప్పుడు ప్రచారం సృష్టించినట్లు వెల్లడించింది.
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉచిత ఎలక్ట్రిక్ సైకిళ్లు పంపిణీ చేసే ఎలాంటి పథకాన్ని ప్రకటించలేదని అధికారులు స్పష్టంగా తెలిపారు. ప్రజలను ఆకర్షించేందుకు కొన్ని మోసగాళ్లు ఇలా ఫేక్ వీడియోలు, లింకులు సృష్టించి వ్యక్తిగత వివరాలు దొంగిలించే ప్రయత్నం చేస్తున్నారని హెచ్చరించారు. ముఖ్యంగా ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటీపీలు వంటి సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోవద్దని సూచించారు.
ఇటీవల సోషల్ మీడియాలో ఫేక్ స్కీమ్స్ పేరుతో మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో, ప్రభుత్వం ప్రకటించే పథకాల వివరాలను అధికారిక వెబ్‌సైట్లు లేదా విశ్వసనీయ వనరుల ద్వారానే ధృవీకరించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ధృవీకరణ లేని వీడియోలు, ఫార్వర్డ్ మెసేజ్‌లు వెంటనే నమ్మకుండా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.































