ప్రేమ ఎప్పుడు ఎలా మొదలవుతుందో చెప్పలేము. నేటి తరం యువత అయితే ఈ ప్రేమ అన్న ఊబిలో పడి మంచి భవిష్యత్తు ఉన్న వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ప్రేమ కోసం ఎంత దూరమైనా వెళ్లడానికి, ఇంకా చెప్పాలి అంటే చావడానికైనా సిద్ధపడుతున్నారు. అలా ఒక యువతి తను ప్రేమించిన అబ్బాయి కోసం బంగ్లాదేశ్ నుంచి ఏకంగా భారత్ కు వచ్చింది. ఆ యువతి ఎవరు? వారి ప్రేమ ఎలా చిగురించింది? ఈ విషయాల గురించి తెలుసుకుందాం..

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన రియల్ ఎస్టేట్ దళారీ హితేష్ జోషితో,బంగ్లాదేశ్‌కు చెందిన సిరిన అక్తర్ హుస్సేన్‌కు ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైంది. ఇది ప్రేమగా మారడంతో ఇతడి కోసం ఆమె అక్రమంగా సరిహద్దులు దాటి వచ్చింది. హైదరాబాద్ నుంచి బోగస్ గుర్తింపు పత్రాలు పొందింది. ఇటీవల ఆ విషయం వెలుగులోకి రావడంతో గుజరాత్ పోలీసులు సిరినను అరెస్టు చేశారు. ఈమెకు ఫోర్జరీ పత్రాలు అందించిన నగరవాసి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. హితేష్,సిరిన మధ్య 2016లో ఫేస్‌బుక్ స్నేహం ఏర్పడటంతో ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. ఆ తర్వాత వాట్సాప్ చాటింగ్స్‌లో ప్రేమించుకున్నారు.
మొదట తన ప్రియుడిని కలుసుకోవాలని భావించిన సిరిన 2017 మార్చిలో 90 రోజుల విజిట్ వీసాపై భారత్‌కు వచ్చి వెళ్లింది.ఇకపై అతడితోనే కలిసి జీవించాలనుకున్న ఆమె ఏకంగా సరిహద్దులు దాటి భారత్‌కు వచ్చి,బంగ్లాదేశ్‌లో ఉన్న దళారుల ద్వారా కోల్‌కతా చేరుకున్న సిరిన అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకుంది. అక్కడ అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన సభ్యుల ద్వారా గుత్తా సోను బిశ్వాస్ పేరుతో నకిలీ ఆధార్ కార్డు, పాన్ కార్డులు సంపాదించింది. అనంతరం అహ్మదాబాద్ వెళ్లి హితేష్‌ను కలిసింది.
2017 అక్టోబర్ నుంచి అక్కడి సనాతన్ ప్రాంతంలో వీళ్లిద్దరూ సహ జీవనం చేయసాగారు. 2018లో వీరికి ఒక పాప కూడా జన్మించింది.2020లో సిరిన సోను పేరుతో అహ్మదాబాద్ రీజనల్ పాస్‌పోర్టు కార్యాలయం నుంచి పాస్‌పోర్టు కూడా పొందింది. దీన్ని వినియోగించి భారతీయురాలిగా బంగ్లాదేశ్ వెళ్లి తన కుటుంబీకులను కలిసి వచ్చింది.అయితే గత నెల ఆఖరి వారంలో హితేష్ అనారోగ్య కారణాలతో కన్ను మూయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది .ఆపై సిరిన అలియాస్ సోను అతడి తల్లిదండ్రుల ఇంటికి చేరింది. ఆస్తుల పంపకం విషయంలో వీరి మధ్య వివాదం తలెత్తి వాగ్వాదానికి కారణమైంది. దీంతో ఆవేశానికి గురైన హితేష్ తల్లిదండ్రులు సిరినను ఉద్దేశించి అక్రమంగా వచ్చిన బంగ్లాదేశీ అంటూ దూషించారు.
ఈ సమాచారం సనాతల్ పోలీసులకు అందడంతో పోలీసులు గత వారం సిరినను అరెస్టు చేశారు. సిరినకు సోను పేరుతో ఆధార్, పాన్ కార్డులు తయారు చేసిన ఇచ్చిన నిందితుల కోసం అహ్మదాబాద్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక బృందాన్ని ఆదివారం హైదరాబాద్ పంపారు. సిరిన కేవలం హితేష్‌పై ఉన్న ప్రేమతోనే ఇలా అక్రమంగా వచ్చిందని, ఈ కేసులో మరే ఇతర కోణం లేదని అహ్మదాబాద్ పోలీసులు చెబుతున్నారు. చట్ట ప్రకారం ఆమె చేసింది నేరం కావడంతో అరెస్టు చేశామని పోలీసులు వెల్లడించారు.































