ఒక్క ముద్దుకు రూ.25 వేలు. అంతేకాకుండా.. క్లినిక్ రెంట్ కూడా 5 నెలల వరకు కిరాయి కడతా.. ఒక్క ముద్దు ఇస్తే చాలు అంటూ ఓ గ్రామస్తుడు మహిళా వైద్యురాలి వద్దకు వెళ్లి వేధించాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. దళిత ఆర్‌ఎంపీ వైద్యురాలితో అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు లైంగికంగా వేధించిన వ్యక్తిపై నిర్భయ కేసుతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదైన ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో చోటుచేసుకున్నది.

మొయినాబాద్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన దళిత మహిళ ఆర్‌ఎంపీగా స్థానికంగా క్లినిక్ నడుపుతున్నారు. జ్వరం, జలుబు లాంటి వాటికి చికిత్స అందిస్తూ అందరితో కలిసి మెలిసి ఉంటుంది. అయితే అదే గ్రామానికి చెందిన పాటి ప్రసాద్‌రెడ్డి వారం క్రితం ఆమె క్లినిక్‌కు వెళ్లి ఆరోగ్య సమస్యపై వైద్య సలహాలు తీసుకున్నాడు.
అనంతరం ఏదైనా సమస్య వస్తే కాల్ చేయడానికి సెల్ నంబర్ కావాలంటూ నంబర్ తీసుకుని వెళ్లాడు. ఆ రోజు సాయంత్రం నుంచే .. కాల్ చేయడం, మెస్సేజ్‌లు పెట్టడం ప్రారంభించాడు. ఆమె నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో క్లినిక్‌కు వెళ్లాడు. ‘నువ్వంటే నాకు ఇష్టం, నిన్ను ప్రేమిస్తున్నా.. ఒక్క ముద్దిస్తే రూ.25 వేలు ఇస్తా, 5 నెలలపాటు క్లినిక్ షెట్టర్ కిరాయి కడతానంటూ వేధించాడు.
అంతటితో ఆగకుండా అసభ్యకరంగా మాట్లాడాడు. ఇదే విషయాన్ని ఆమె కుటుంసభ్యలుకు చెప్పడంతో.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న సదరు వ్యక్తి ఆ ఊరి నుంచి పారిపోయారు. పరారీలో ఉన్న అతడిని పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.






























