Vilan Tiger Prabhakar Wife Anju : అంజు.. ఈ పేరు వినగానే మనకు ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుకు వస్తారు. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం ఇలా సౌత్ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. నిజానికి ఆమె అసలు పేరు పార్వతి. కానీ, అంజుగా సినిమా ఇండస్ట్రీలో స్థిరపడిపోయారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా తెలుగులో శోభన్ బాబు, చిరంజీవి వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించారు. హీరోయిన్‌గా దాదాపు అన్ని భాషల్లో కలిపి 70కి పైగా సినిమాల్లో మెరిసింది. తెలుగులో ‘నిరీక్షణ’ వంటి సినిమాలో అంజు నటనకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ‘శేషు’లో నటించి మెప్పించింది. ఒక యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, కెరీర్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు అంజు.

టైగర్ ప్రభాకర్‌తో పెళ్లి… విడాకులు… చివరి చూపునకు కూడా వెళ్లలేదు…
చైల్డ్ ఆర్టిస్ట్ నుండి హీరోయిన్‌గా మారిన అంజు కన్నడ సినిమాల్లో నటిస్తున్న సమయంలో విలన్‌గా మంచి పేరు తెచ్చుకున్న టైగర్ ప్రభాకర్‌తో ప్రేమలో పడ్డారు. ఒక సినిమాలో కలిసి పనిచేసేటప్పుడు వారి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ప్రభాకర్ ఆమెకు ప్రపోజ్ చేశారు. అంజు ఇంట్లో వాళ్లు వద్దని చెప్పినా వినకుండా ఆ సినిమా పూర్తయ్యాక పెళ్లి చేసుకున్నారు. అయితే, అప్పటికే ప్రభాకర్‌కు ఒక పెళ్లయి విడాకులు తీసుకున్న విషయం అంజుకు తెలుసు. ఇద్దరి మధ్య వయసు వ్యత్యాసం కూడా ఎక్కువే. పెళ్లి సమయానికి అంజు వయసు 18 ఏళ్లు కాగా, ప్రభాకర్ వయసు నలభై దాటిపోయింది. అయినా ఆమె పెద్దలను ఎదిరించి ఆయన్ని పెళ్లి చేసుకున్నారు. పెళ్లయ్యాక ప్రభాకర్‌కు అప్పటికే రెండు పెళ్లిళ్లు అయ్యాయనే విషయం అంజుకు తెలిసి షాక్ అయ్యారు.
మూడు నెలల గర్భవతిగా ఉన్న సమయంలో గొడవలు ఎక్కువయ్యాయి. ‘ఉంటే సర్దుకుని ఉండు.. లేకపోతే వెళ్లిపో’ అని భర్త చెప్పడంతో, ఆయనకు చాలామంది అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయని తెలిసి అంజు పుట్టింటికి వచ్చేశారు. బాబు పుట్టాక ఒక్కసారి కూడా తన కొడుకుని చూడటానికి రాలేదని, ఆ బాధ, కోపం తనలో ఉన్నాయని అంజు చెప్పారు. టైగర్ ప్రభాకర్ 48 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించారు. అప్పటికి అంజు కొడుకు వయసు మూడు సంవత్సరాలు. కాబట్టి తన తండ్రి గురించి వాడికి పెద్దగా ఏమీ తెలియదు. ప్రభాకర్ చనిపోయిన విషయం కూడా ఒక నిర్మాత ఫోన్ చేసి చెప్పడం ద్వారా అంజుకు తెలిసింది. అయితే, ఆయన చనిపోయినప్పుడు చూడటానికి కూడా వెళ్లాలని అనిపించలేదని, అందుకే వెళ్లలేదని అంజు చెప్పారు.
































