ఏపీకి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్. సంజయ్‌ను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. “తాను ఒక్క రూపాయి కూడా అవినీతి చేయలేదని, రాజకీయ కక్షతోనే కేసులు పెట్టారని” స్పష్టం చేశారు.

సంజయ్ గతంలో జగన్ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా, అలాగే ఫైర్ డిపార్ట్‌మెంట్ ఐజీగా పని చేశారు. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న సమయంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టులో ఆయన పాత్ర ఉందన్న చర్చ అప్పట్లో జరిగింది. అయితే, “ప్రభుత్వ ఆదేశాలకే కట్టుబడి పని చేశానని, చంద్రబాబుపై ఎటువంటి వ్యక్తిగత కక్షా లేదని” ఆయన స్పష్టం చేశారు.
అగ్నిమాపక శాఖ డీజీగా ఉన్న సమయంలో నిధుల దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణలపై ఇప్పుడు కేసు నమోదు కావడంతో ఈ విచారణ కొనసాగుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏసీబీ కోర్టులో లొంగిపోయిన సంజయ్‌ను మూడు రోజుల పాటు విచారణకు తీసుకున్నారు.
ప్రస్తుతం విజయవాడ ఏసీబీ కార్యాలయంలో ఐజీ స్థాయి అధికారులు విచారిస్తున్నారు. “మీరైనా నేనైనా ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే కదా పని చేయాలి. అవినీతి చేసి ఉంటే కేసులు చుట్టుముట్టేవి కావు” అని సంజయ్ వ్యాఖ్యానించినట్టు తెలిసింది.
ఆయన ఇల్లు, ఆస్తులను కూడా తనిఖీ చేయమని సవాలు విసిరినట్లు సమాచారం.



































