తిరుమల/శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి ఎమ్మెల్యే, టీడీపీ నేత బొజ్జల సుధీర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన రాయుడు హత్య కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన దేవుడి సాక్షిగా చెబుతూ క్లారిటీ ఇచ్చారు. బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

“తిరుమల స్వామి సన్నిధిలో ఉండి చెబుతున్నా, రాయుడు హత్యతో, అలాగే వినూత విషయంలో నాకు ఎలాంటి సంబంధం లేదు” అని బొజ్జల సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. తనపై వైసీపీ రాజకీయ కోణంలో తీవ్ర అభాండాలు వేస్తోందని ఆయన ఆరోపించారు.
కాగా, గతంలో టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిపై కోట వినూత దంపతులు సంచలన ఆరోపణలు చేశారు. రాయుడిని హత్య చేసింది టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీరే అంటూ వారు బాంబు పేల్చారు. త్వరలోనే అన్ని నిజాలు బయటకు వస్తాయని కోట వినూత దంపతులు అప్పట్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, బొజ్జల సుధీర్ రెడ్డి తిరుమల శ్రీవారి సాక్షిగా చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి.



































