తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని కొండయ్య పల్లి గ్రామం గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. అయితే ఆ గ్రామంలోని ప్రజలు చేస్తున్న ఒక పని వల్ల ఆ గ్రామం పేరు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా మారుమ్రోగుతోంది. ఆ గ్రామంలో గ్రామ ప్రజలు ఊరిలో అమ్మాయి పుడితే ఆ అమ్మాయి పేరిట 5,000 రూపాయలు డిపాజిట్ చేయడంతో పాటు అమ్మాయి పెద్దైన తరువాత ఊరోళ్లే పెళ్లి కూడా చేస్తారు.

గ్రామస్తులు అమ్మాయిల విషయంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి ముఖ్యమైన కారణాలే ఉన్నాయి. పేదింటి అమ్మాయిలు పెళ్లి సమయంలో ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో గ్రామస్తులు ఫౌండేషన్ ను ఏర్పాటు చేసి ఆ ఫౌండేషన్ ద్వారా ప్రయోజనం చేకూరేలా చేస్తున్నారు. ఆ గ్రామంలో పెంటయ్య అనే దంపతులు చాలా సంవత్సరాల నుంచి నివాసం ఉండేవాళ్లు. పెంటయ్య ఉపాధి కోసం కొన్నేళ్ల క్రితం మహారాష్ట్రకు వెళ్లాడు.

అయితే ఉపాధి కోసం వెళ్లిన పెంటయ్య కుటుంబసభ్యుల ఆలనాపాలనా చూడటం మరిచిపోయాడు. పెద్దకూతురు సరిత పెళ్లీడుకు రాగా ఆమె తండ్రి పట్టించుకోకపోవడంతో ఊరి జనం అంతా డబ్బులు జమ చేసి 40,000 రూపాయల ఖర్చుతో ఘనంగా ఆమె పెళ్లి చేశారు. ఆ తరువాత ఆ ఊరిలోని ఎన్.ఆర్.ఐ శ్రీనివాస్, ఆ ఊరి యువత మా ఊరి మహాలక్ష్మి పేరుతో ఫౌండేషన్ ను ఏర్పాటు చేశారు.

అమ్మాయి పుట్టినప్పుడే 5,000 డిపాజిట్ చేయడంతో పాటు ఆర్థిక పరిస్థితి బాగోలేని వారికి ఊరోళ్లే పెళ్లి చేస్తున్నారు. గ్రామ ప్రజలు తాము చేస్తున్న సాయం తక్కువే అయినా పేదింటి ఆడబిడ్డలకు ఎంతో ప్రయోజనం చేకూరుతోందని చెబుతున్నారు. ప్రభుత్వం కూడా పుట్టిన ఆడపిల్లలకు కొంత మొత్తం సహాయం చేస్తే బాగుంటుందని కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here