వంటగదిలో పుదీనా వాసన లేకుండా వంట పూర్తి అవ్వడం అరుదు. చట్నీలు, షర్బత్‌లు, మజ్జిగ, సలాడ్లు ఇలా ఎన్నో వంటకాల్లో పుదీనా ప్రత్యేక రుచిని ఇస్తుంది. సహజంగా చల్లదనం కలిగించే ఈ ఆకును చాలా మంది ఆరోగ్యానికి మేలు చేస్తుందని భావిస్తారు. జీర్ణక్రియ మెరుగుపరుస్తుందని, శరీరాన్ని ఫ్రెష్‌గా ఉంచుతుందని కూడా వినియోగం పెరుగుతోంది. కానీ నిపుణుల ప్రకారం, పుదీనాను అవసరానికి మించి తీసుకోవడం కొన్ని సందర్భాల్లో ఆరోగ్యానికి హానికరంగా మారే అవకాశం ఉంది.

పుదీనాలో ఉండే మెంతోల్ అనే సహజ పదార్థం శరీరంపై ప్రభావం చూపుతుంది. ఇది కొంతమందికి ఉపయోగకరంగా ఉండొచ్చు కానీ అధిక మోతాదులో తీసుకుంటే జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. సాధారణంగా అజీర్తి తగ్గించడానికి ఉపయోగించే పుదీనా, ఎక్కువగా తీసుకుంటే కడుపులో ఆమ్లాలు పైకి రావడానికి కారణమవుతుంది. దీంతో గుండెల్లో మంట, ఎసిడిటీ వంటి సమస్యలు పెరగవచ్చు. ఇప్పటికే గ్యాస్ లేదా అల్సర్ సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
రక్తపోటుపై కూడా పుదీనా ప్రభావం చూపుతుంది. ఇది సహజంగా బీపీని తగ్గించే లక్షణం కలిగి ఉంటుంది. అధిక రక్తపోటు ఉన్నవారికి ఇది కొంతవరకు ఉపశమనం ఇవ్వొచ్చు. అయితే లో బీపీ ఉన్నవారు లేదా బీపీ మందులు వాడుతున్నవారు ఎక్కువగా తీసుకుంటే రక్తపోటు మరింత తగ్గే ప్రమాదం ఉంటుంది. దాంతో తలనొప్పి, కళ్లు తిరగడం, బలహీనత వంటి లక్షణాలు కనిపించవచ్చు.
కొంతమందిలో పుదీనా చర్మ సమస్యలకు కూడా కారణమవుతుంది. పుదీనా నూనె లేదా రసం నేరుగా చర్మంపై వాడితే దురద, ఎర్రటి మచ్చలు వచ్చే అవకాశం ఉంది. అలాగే దీని ఘాటు వాసన కొందరికి తట్టుకోలేనిది కావచ్చు. అలాంటి సందర్భాల్లో తుమ్ములు, శ్వాసలో స్వల్ప ఇబ్బందులు కూడా కనిపించవచ్చు. ముఖ్యంగా ఆస్తమా ఉన్నవారు లేదా శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు పుదీనా వినియోగంలో జాగ్రత్తలు పాటించడం మంచిది.
గర్భిణీలు మరియు బాలింతల విషయంలో కూడా పుదీనా వినియోగంపై జాగ్రత్త అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. గర్భధారణ సమయంలో వికారాన్ని తగ్గించడానికి కొంతమంది పుదీనా టీ తీసుకుంటారు. అయితే అధికంగా తీసుకుంటే శరీరంలో హార్మోన్ల సమతుల్యతపై ప్రభావం పడే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అలాగే పాలిచ్చే తల్లులు ఎక్కువగా తీసుకుంటే పాల ఉత్పత్తిపై ప్రభావం పడే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
మొత్తంగా చూస్తే, పుదీనా పూర్తిగా హానికరమైనది కాదు. సరైన మోతాదులో తీసుకుంటే ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది, శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. కానీ అతిగా తీసుకోవడం వల్ల అనవసర ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అందువల్ల ప్రతి ఆహార పదార్థాన్ని మితంగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.































