టీమిండియా ఇంగ్లండ్ పర్యటనను ఓటమితో ప్రారంభించింది. లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో 371 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ కేవలం ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేజ్ చేసి ఘనవిజయం సాధించింది. 82 ఓవర్లలోనే టార్గెట్‌ను చేరుకున్న ఇంగ్లండ్ భారీగా మెరిసింది. ముఖ్యంగా ఓపెనర్ బెన్ డకెట్ తన దూకుడైన సెంచరీతో మ్యాచ్‌ను ఇంగ్లండ్‌కు జయదిశగా నడిపించాడు.
డకెట్ 170 బంతుల్లోనే 149 పరుగులు చేయగా, 21 ఫోర్లు, ఒక సిక్సర్ బాదేశాడు. ఆయనతో పాటు జాక్ క్రాలె (65), జో రూట్ (53) హాఫ్ సెంచరీలు సాధించగా, జేమీ స్మిత్ (44), బెన్ స్టోక్స్ (33) కూడా కీలక సమయంలో రాణించారు. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, ప్రసిద్ధ్ కృష్ణ తలో రెండు వికెట్లు పడగొట్టారు. జడేజా ఒక్క వికెట్ తీశాడు.
మ్యాచ్ మొత్తం విశ్లేషిస్తే — భారత జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 471 పరుగులు చేసింది. ఆ తర్వాత ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 465 పరుగులతో సమాధానం ఇచ్చింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 364 పరుగులు చేయగా, మొత్తం 371 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఎదురు చూపులేకుండా ఛేదించింది. భారత్ బ్యాటింగ్ వైపు నుంచి కేఎల్ రాహుల్ (137), రిషబ్ పంత్ (118) శతకాలు చేసి నిలబడ్డారు. అయితే బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో భారత్ పూర్తిగా విఫలమవడంతో విజయం చేజారిపోయింది.
ఈ ఓటమితో 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు భారత్ 0-1తో వెనుకబడి పోయింది. రాబోయే టెస్టుల్లో భారత్ తిరిగి పుంజుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.

































