“విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం.. సరసస్వర శురచరీ గమనమౌ సామవేద సారమిది.. నే పాడిన జీవన గీతం ఈ గీతం..”ఆది భిక్షువు వాడిని ఏది కోరేది బూడిదిచ్చేవాడినేది ఏది అడిగేది.. లాంటి పాటలు… రాసిన సిరివెన్నెల సీతారామశాస్త్రి.. కేవలం సంస్కృత, గ్రాంధిక భాషకు, భావాలకు పరిమితం అనే భావన ఆ రోజుల్లో సినీ ప్రముఖులతో పాటు ప్రేక్షకులకు కూడా సందేహంగా ఉండేది.

కళాదర్శకుడు విశ్వనాధ్ మేధో మథనం నుంచి జాలువారిన సిరిసిరిమువ్వ, శంకరాభరణం, సాగర సంగమం లాంటి చిత్రాలకు ఆస్థాన కవిగా ఉన్న వేటూరి సుందరరామ్మూర్తికి కాస్త ఉపశమనాన్ని ఇస్తూ… ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బి.ఏ పూర్తి చేసి ఎం.ఏ తెలుగు చేస్తున్న సీతారామ శాస్త్రి రాసిన సాహిత్యాన్ని విన్నా కళాతపస్వి విశ్వనాథ్ తాను తీయబోయే ‘సిరివెన్నెల’ సినిమాకి గీత రచయితగా తీసుకున్నారు. సీతారామశాస్త్రి అంది వచ్చిన అవకాశాన్ని అదృష్టంగా భావించి.. తన కలానికి పదును పెట్టారు. సిరివెన్నెల సినిమాకి గాను ఆయన కలం నుంచి జాలువారిన అన్ని గీతాలు అని ముత్యాలుగా నిలిచాయి.

ఈ సినిమాతో సీతారామశాస్త్రి కాస్త సిరివెన్నెల సీతారామశాస్త్రిగా మారిపోయారు. ఈ చిత్రంలోని “విధాత తలపున ప్రభవించినది.. అనే గీతానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత స్వర్ణకమలం, శృతిలయలు, స్వయంకృషి లాంటి చిత్రాలకు సాహితీ విలువలతో కూడిన పాటలు రాస్తున్న సిరివెన్నెల సీతారామశాస్త్రి.. 1988 ప్రాంతంలో అప్పుడే అవకాశం అందిపుచ్చుకున్న యువ దర్శకుడు రాంగోపాల్ వర్మ అప్పటివరకు వస్తున్నా సినిమాలకు భిన్నంగా యూత్ ఫుల్ మూవీగా ‘శివ’ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఆ క్రమంలో ఆ సినిమాకి ఇళయరాజాను సంగీత దర్శకుడిగా ఎన్నుకున్నారు. సినిమాలో సందర్భోచితంగా వచ్చే పాటలకు గీత రచయితగా ఎవరిని తీసుకుందాం అనుకున్న క్రమంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి ప్రస్తావనకు వచ్చినప్పుడు.. ఆ విషయంలో కొంత సందిగ్ధత నెలకొంది.

లోగడ “సిరివెన్నెల” సినిమాలో భావగర్భితమైన పాటలు రాసిన శాస్త్రి.. ఇలాంటి యూత్ ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ సినిమాకి పాటలని రాయగలుగుతాడా.. అనే సందేహం ఒక రాంగోపాల్ వర్మకి మాత్రమే కాకుండా ఆ సినిమా యూనిట్ సభ్యులు కూడా కలిగింది. నాగార్జున అండ్ ఫ్రెండ్స్ కాలేజీలో సరదాగా ఉన్నప్పుడు వచ్చే పాట కోసం ఇళయరాజా ఇచ్చిన ట్యూన్ కి శాస్త్రి ఫుల్ జోష్ తో కూడిన “బాటని పాఠముంది.. మ్యాటనీ ఆట ఉంది దేనికో ఓటు చెప్పరా… హిస్టరీ లెక్చర్ ఉంది మిస్టరీ పిక్చర్ ఉంది.. సోదరా ఏది బెస్టు రా.. అనే పాట ‘శివ’ చిత్రంలో రావడంతో ప్రేక్షకులు కుర్చీలో కిర్రెక్కిపోయారు. కట్ చేస్తే సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి అలాంటి యూత్ ఫుల్ జోష్ పాటలు రాసి అప్పటి వరకు ఉన్న సందేహాలను పటాపంచలు చేశారు.































