సినిమా పెట్టుబడి అనేది..కథ మీద దర్శకుడి మీద కంటే హీరో మార్కెట్ మీదే ఇప్పుడు ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. గతంలో కథకు ఏం కావాలో అది చేసే వారు దర్శక నిర్మాతలు. ఆ తర్వాత ట్రెండ్ మారింది. హీరో ఎలాంటి కథ అయితే ఒప్పుకుంటాడో.. జనాలు, అభిమానులు ఎలాంటి కథల్లో అయితే చూడాలనుకుంటున్నారో అలాంటి కథలను దర్శక రచయితలు అల్లేస్తున్నారు. శత చిత్ర దర్శకుడు కోడి రామకృష అన్నట్టుగా సినిమాలో గ్రాఫిక్స్ ఉండాలి గానీ గ్రాఫిక్స్ కోసమే సినిమా చేయకూడదు. కానీ ఇప్పుడు అదే జరుగుతోంది.

ఒక సాధారణ కథకు కూడా అనవసరమైన గ్రాఫిక్స్ జోడించి సినిమా బడ్జెట్ పెంచేసి.. చివరికి అది ప్రేక్షకులను నచ్చక నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ రోడ్డున పడే పరిస్థితులు వస్తున్నాయి. రాజమౌళి ఓ నార్మల్ కథను హై టెక్నాలజీ, వీఎఫెక్స్ జోడించి హాలీవుడ్ సినిమాగా మార్చేస్తున్నారు. దానికోసం ఆయన పెట్టించే బడ్జెట్ ఎప్పటికప్పుడు ఔరా అనిపిస్తూనే ఉంది. ఇక క్రియేటివ్ జీనియస్ శంకర్ ఒక సాంగ్ కోసమే కొన్ని సార్లు 20 నుంచి 30 కోట్లు ఖర్చు చేయిస్తున్నారు. గ్రాండ్‌నెస్ ఉంటుంది కాని అది ఎంత సేపు.

ఓ 4 నిముషాల పాట కోసం అన్ని కోట్ల బడ్జెట్ అంటే ఏదైనా సినిమా రిజల్ట్ తేడా జరిగితే నష్ఠపోయేది నిర్మాతే. సుకుమార్ లాంటి వారు గతకొంతకాలంగా మట్టి వాసన అనిపించే కథలను తెర మీద ఆవిష్కరిస్తున్నారు. మంచి విజయాలను అందుకుంటున్నారు. స్టైలిష్ డైరెక్టర్‌గా పేరున్న సుకుమార్ నుంచి రంగస్థలం లాంటి కల్ట్ కంటెంట్ ఉన్న సినిమా వస్తుందని ఎవరూ ఊహించరు. పైగా హీరోకు చెవుడు. అది కూడా మెగా పవర్ స్టార్ రాం చరణ్ లాంటి స్టార్ అంటే అది ఎంతపెద్ద సాహసమో అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ కథను నమ్మి సుకుమార్, చరణ్, నిర్మాతలు రంగస్థలం సినిమా చేశారు.

ఈ సినిమా చూస్తున్నంతసేపు ఓ 30 – 40 ఏళ్ళ వెనక్కి తీసుకు వెళ్ళింది. ఇలాంటి కథలతో ప్రయోగం చేసినా బావుంటుంది. 30 ఎకరాలలో విలేజ్ సెట్ వేసి షూటింగ్ జరిపినా అది అంతగా ఎవరికీ తెలియలేదు. ఇప్పుడు రాబోతున్న పుష్ప కూడా ఇలాంటి ఓ విలేజ్ బ్యాక్‌డ్రాప్ కథనే. ఈ సినిమాలో అల్లు అర్జున్, రష్మిక మందన్నల గెటప్స్ చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అని ఆసక్తి విపరీతంగా పెరుగుతోంది. ఈ సినిమాను పాన్ ఇండియన్ స్థాయిలో 5 భాషలలో రిలీజ్ చేస్తున్నారు. ఇలాంటి కథలకు గ్రాఫిక్స్ మీద ఆధారపడి చేయాల్సిన అవసరం ఉండదు. కేవలం హీరో మేకోవర్.. డైరెక్టర్ మేకింగ్ మీద సినిమా అంచనాలు పెరుగుతాయి. అందుకే మన స్టార్ హీరోలు కష్టమైనా మేకోవర్ కోసం బాగా కష్టపడుతున్నారు.
































