ఈ మధ్య కాలంలో మన టాలీవుడ్ మేకర్స్ లోకల్ టాలెంట్‌ను బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. గతంలో చాలామంది మ్యూజిక్ డైరెక్టరె ఎక్కువగా బాలీవుడ్ సింగర్స్..హాలీవుడ్ సింగర్స్‌ను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసి పాటలు పాడించారు. బాలీవుడ్‌లో పాపులర్ సింగర్ అయిన ఉదిత్ నారాయణ్, శ్రేయా ఘోషాల్ లాంటి వారు తెలుగులో ఎన్నో సూపర్ హిట్స్ పాడారు. వారే కాదు శంకర్ మహదేవన్, హరి హరణ్ లాంటి వారు మన టాలీవుడ్ స్టార్ అయిన మెగాస్టార్, వెంకటేశ్, బాలకృష్ణ, నాగార్జున లాంటి వారికి పాటలు పాడారు.

వారికి మాత్రమే కాదు యంగ్ హీరోలకు పాడారు. ఇక పాప్ సింగర్ అద్నాన్ సమీ కూడా తెలుగులో చాలానే పాటలు పాడారు. అద్నాన్ సమీ లాంటి వారికి భాష తెలియకపోయినా వారికి పదాలన్నీ అర్థం అయ్యేవరకు ప్రాక్టీస్ చేయించి పాడించారు. అప్పట్లో ఈ విషయంలో చాలా రకాల కామెంట్స్ వచ్చినా కూడా సింగర్స్‌గా వారికున్న క్రేజ్ కారణంగా ఆల్బంలో వారి పాట ఉండేలా చూసుకున్నారు. ఓ సినిమా ఆల్బంలో ఈ పాపులర్ సింగర్ పాడిన పాట ఉంటే మ్యూజిక్ పెద్ద హిట్ అవుతుందని భావించేవారు.

అయితే థమన్, దేవీశ్రీప్రసాద్ లాంటి వారు ఇప్పుడు ఎక్కువగా లోకల్ టాలెంట్‌ను బయటకు తీసుకువస్తున్నారు. వీరు పాడిన పాటలు ఇప్పుడు సినిమాలో సూపర్ హిట్ పాటగా నిలుస్తోంది. లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ చేయగానే యూట్యూబ్‌లో బాగా ట్రెండ్ అవుతోంది. అందుకు కారణం వారి మ్యాజికల్ వాయిసేనని చెప్పాలి. ఆ మధ్య పెంచల్ దాస్ గొంతుకు ఫిదా అయిన అభిమానులు ఎంతో మంది ఉన్నారు. మనసుకు నచ్చితే గానీ పాట రాసి పాడని పెంచల్ దాస్ తెలుగు సినిమాలలో రాసి పాడింది చాలా తక్కువ పాటలే.

కానీ ఆ పాటలు సూపర్ హిట్‌గా నిలిచాయి. రాయలసీమ ప్రాంతానికి చెందిన పెంచల్ దాస్ నాని నటించిన కృష్ణార్జున యుద్దం, ఎన్.టి.ఆర్ నటించిన అరవింద సమేత వీర రాఘవ, శర్వానంద్ నటించిన శ్రీకారం, సాయి ధరం తేజ్ నటించిన చిత్రలహరి సినిమాలోనూ పాటలు రాసి పాడాడు. కానీ ఆయనకు వరుసగా అవకాశాలు దక్కడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఇక ఈ మధ్య బాగా పాపులారిటీ సంపాదించుకున్న లోకల్ సింగర్స్ దర్శనం మొగులయ్య.. తాజాగా కుమ్మరి దుర్గవ్వ, మౌనిక యాదవ్.

పుష్ప సినిమాలో బాగా ట్రెండ్ అయిన పాట సామీ..సామీ. ఈసాంగ్ పాడింది యువ గాయని మౌనిక యాదవ్. ఆమె గొంతుకు ఇప్పుడు అందరూ ఫ్యాన్స్ అయిపోతున్నారు. ఆమె ఎక్కడా సంగీతం నేర్చుకోలేదు. కానీ అద్భుతంగా పాడగలదు. అదే ఆమెకు పాన్ ఇండియన్ సినిమా పుష్పలో పాట పాడే అవకాశం వచ్చేలా చేసింది.

దర్శనం మొగులయ్య భీమ్లా నాయక్ సినిమాలో టైటిల్ సాంగ్ పాడాడు. నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం అవుసలికుంటకు చెందినవాడు. ఇప్పటికే ఎన్నో ఫోక్ సాంగ్స్ పాడారు మొగులయ్య.

ఈ క్రమంలోనే థమన్ మరో లోకల్ టాలెంట్‌తో భీమ్లా నాయక్ సినిమాలో అడవి తల్లి పాట పాడించారు. ఇప్పుడీ పాట విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఈ పాట పాడిన ఫోక్ సింగర్ కుమ్మరి దుర్గవ్వ. ఈమె కూడా చదువు కోలేదు. కానీ తెలుగు, మరాఠి భాషలలో చాలా పాటలు పాడింది. ఇప్పుడు ఈ లోకల్ టాలెంట్ అంతా వెలుగులోకి వస్తోంది. అయితే పూర్తి స్థాయిలో మాత్రం వీకి అవకాశాలు దక్కడం లేదు.































