సౌందర్య పదహారణాల తెలుగు అమ్మాయిల మన కుటుంబంలోని తోబుట్టువుల చూడచక్కని రూపం, అద్దానికి అసూయ పుట్టే అందం ఆమె సొంతం. సినిమాలలో అందాల ప్రదర్శనకు ఆవిడ ఆమడ దూరం. సాంప్రదాయ గృహిణి పాత్రలు ఆమెకు పెట్టని ఆభరణం. పట్టు పరికిణి లో ఆమె ఒక తెలుగు తోరణం. పట్టు చీరలో ఓ వెలుగు కిరణం. అజంతా శిల్పాలు, ఎల్లోరా అందాలు ఆమె నిండైన సొగసుకు దిగదుడుపు.

అభినవ సావిత్రిగా..బరువైన పాత్రలు మోసే దరిత్రిగా.. సినిమాలో ఆమె నటన అజరామరం. ఆత్మాభిమానం చాటే భానుమతిలా.. ఆత్మగౌరవంతో నటించే భానుప్రియలా.. వాలుకళ్ళతో అభినయించే వాణిశ్రీలా.. చిరునవ్వులతో చిందేసే శ్రీదేవిలా.. ఏ పాత్రలోనైనా ఇట్టే ఇమిడిపోయే పాదరసంలా నటనకే వన్నె తెచ్చి నలుగురిలో శభాష్ అనిపించుకున్న సౌందర్య.

1993 ప్రాంతంలో హరీష్ హీరోగా నటించిన మనవరాలిపెళ్లి చిత్రంతో సౌందర్య తెలుగులో అడుగు పెట్టింది. ఆ తర్వాత మేడమ్, అల్లరి ప్రేమికుడు, రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు లాంటి సినిమాల్లో నటించింది. అనతికాలంలోనే అరుదైన పేరు పొందింది. రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు లాంటి సినిమాలను నిర్మించిన కె.అచ్చిరెడ్డి, ఎస్వీ.కృష్ణారెడ్డి దర్శకత్వం లో మరొక సినిమాను చేద్దామనుకున్నారు.

 

1990 ప్రథమార్థంలో సోషియో ఫాంటసీ సినిమాల జోరు నడుస్తోంది. కావున అచ్చిరెడ్డి ఎస్.వి.కృష్ణారెడ్డి లు అలాంటి సినిమా ఒకటి తీద్దాం అనుకున్నారు. అప్పటికి యమగోల యముడికి మొగుడు లాంటి సినిమాలు ఘన విజయాన్ని సాధించాయి. కావున అలాంటి కథతో ఒక సినిమా చేద్దామనుకున్నారు. యమస్పీడు అనే టైటిల్ తో ఒక కథ సిద్ధమైంది. ఈ సినిమాని ఏ హీరోతో తీద్ధామా అనే క్రమంలో వారికి ఓ మంచి ఆలోచన వచ్చింది.

 

ఆ సినిమాకి అనేక సంప్రదింపుల తర్వాత అలీని హీరోగా పెట్టి తీద్దాం అనుకున్నారు. ఇక మిగిలింది హీరోయిన్ మాత్రమే కావున ఇంతకుముందు రాజేంద్రుడు-గజేంద్రుడు, మాయలోడు చిత్రాల్లో నటించిన సౌందర్యను ఈ సినిమాలో హీరోయిన్ గా అనుకున్నారు. ఆ విషయాన్ని సౌందర్య కు చెప్పి ఒప్పించడం జరిగింది.

తెలుగు పరిశ్రమకు వచ్చిన అనతి కాలంలోనే స్టార్ డమ్ వచ్చిన సౌందర్య మామూలు కామెడీ హీరోతో సినిమా తీయడం ఏమిటి.. అప్పటికే స్టార్ హీరో నాగార్జునతో హలో బ్రదర్ లో నటిస్తుంది. తిరిగి చిన్న హీరోతో సినిమా చేస్తే తన సిని భవిష్యత్తుకు అవరోధంగా ఉంటుందని ఈ విషయాన్ని తనకు ఆఫర్స్ ఇచ్చిన అచ్చి రెడ్డి, ఎస్.వి.కృష్ణారెడ్డి లకు ఎలా చెప్పాలి అనే దిగులుతో సౌందర్యకు ఏకంగా చలి జ్వరం వచ్చిందని ఆమె తండ్రి గారు స్వయంగా తన ఇంటికి వచ్చిన అచ్చిరెడ్డికి ఎస్వి.కృష్ణారెడ్డి కి చెప్పడంతో…

ఈ విషయాన్ని ముందుగానే చెబితే వేరే హీరోయిన్ ని బుక్ చేసేవాళ్ళం. అంతేగాని ఇలా సౌందర్య తనలో తానే ఇబ్బంది పడటం ఎందుకని చివరికి యమస్పీడ్ గా ఉన్న టైటిల్ కాస్త యమలీలగా మార్చి హీరోయిన్ గా ఇంద్రజను ఎంపిక చేశారు. 1994లో యమలీల సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ అయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here