ఈ దర్శకుడి సినిమాలంటే హీరో చిటికేస్తే సుమోలు లెవ్వాల్సిందే, తొడగొట్టి ట్రైన్ లను ఆపాల్సిందే, రాయలసీమ ప్రాంతంలో రక్తపుటేరులు పారాల్సిందే, విలన్ అంటే బాంబులతో బెంబే లెత్తించాల్సిందే, అల్లరి మూకలను కొడవళ్లతో వేటాడాల్సిందే విపరీతమైన హీరోఎలివేషన్ ప్రధాన అంశాలుగా వివి వినాయక్ తన కథలను సిద్ధం చేసుకుంటాడు.

తన కెరీర్ బిగినింగ్ లో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆది సినిమా తో ప్రారంభం అయ్యింది. మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ ని పొందింది, వి.వి.వినాయక్ రెండో సినిమాగా చెన్నకేశవరెడ్డి తీశారు. ఆ తర్వాత దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో దిల్ సినిమాను రూపొందించాడు. ఆ తర్వాత చిరంజీవితో ఠాగూర్ సినిమా రూపొందిస్తున్న తరుణంలో ఎన్టీఆర్ తో రెండో సినిమాగా “ఒక కోటీశ్వరుడు 100 మంది కోటీశ్వరులను తయారు చేయలేడు కానీ ఓ చదువుకున్నవాడు వందమంది చదువుకున్నవాళ్లను తయారు చేస్తాడు. అనే మంచి అంశంతో వివి.వినాయక్ తన నాలుగో చిత్రంగా సాంబ అనే సినిమా ను రూపొందించాడు.

కొడాలి నాని, వివి.వినాయక్ కాంబినేషన్లో సినిమా అనుకున్నప్పుడు చిన్నికృష్ణ కాశీ నేపథ్యంలో ఒక కథ చెప్పారు. ఆ కథ ఇంద్ర, నరసింహనాయుడు లాంటి సినిమాలకు దగ్గర పోలిక ఉండడంతో.. సింహాద్రి కి ఒక స్టోరీ లైన్ ఇచ్చిన జి.ఎస్.రావు కి స్టోరీ బాధ్యతలు అప్పగించారు. మొదటగా ఈ సినిమాకి హీరోయిన్లుగా ఆర్తి అగర్వాల్, రక్షిత లను అనుకున్నారు.

కానీ ఆర్తి అగర్వాల్ నేనున్నాను సినిమా తో డేట్స్ కుదరక పోవడం వలన ఆమె స్థానంలో భూమికను, అదేవిధంగా ఆంధ్రావాలా సినిమా ఫెయిల్ అవడంతో రక్షిత స్థానంలో జెనీలియా తీసుకున్నారు. తెలుగు సినిమాలు దాదాపు10 కోట్ల లోపు బడ్జెట్ నడుస్తున్న సమయంలో కొడాలి నాని సాంబ సినిమాకి ఏకంగా 12 కోట్లు బడ్జెట్ పెట్టారు. కానీ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. అయితే ఈ సినిమాలో మితిమీరిన హింస తో పాటు ఓ బలాత్కారం చేసే సీన్ ఒకటి ఉంటుంది. అలాంటి సీన్ ఎందుకు పెట్టానని వి.వి.వినాయక్ ఇప్పటికీ బాధపడుతూ ఉంటారు.


































