కైకాల సత్యనారాయణ ఈ పేరు వింటే ఒక వైబ్రేషన్ కలుగుతుంది. విలన్ గా, కేరెక్టర్ ఆర్టిస్ట్ గా వైవిద్యభరిత పాత్రల్లో మెప్పించిన మహానటుడు. అయితే ఈయనకి ఆ గుర్తింపు, పేరు, సినిమాల్లో అవకాశాలు అంత సులువుగా రాలేదు. దాని కోసం ఎన్నో కష్టాలు పడ్డారు. అసలు కైకాలకి నటుడవ్వాలన్న కోరిక ఎప్పుడు ఎక్కడ మొదలైందంటే, ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు కాలేజ్ గా పిలవబడుతున్న గుడివాడ కాలేజ్ లో చదువుతున్నప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన నాటకాన్ని చూసినప్పుడు. అప్పుడే కైకాల సత్యనారాయణకి నటుడి అవ్వాలన్న ఆసక్తి ఏర్పడింది. అయితే క్లాస్ మేట్ కె.ఎల్. ధర్గార్ అని మద్రాస్ లో అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్ గా సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఎల్వీప్రసాద్ గారు కొత్తవాళ్లతో సినిమా చేస్తున్నారు. మద్రాస్ లో ఒక నెల రోజులు ఉండేలా ప్లాన్ చేసుకుని వస్తే సినిమా అవకాశం వస్తుంది అని ఉత్తరం రాసి పంపించారు. అది చూసి సంతోషంతో ఎగిరి గెంతేసి మద్రాస్ బయలుదేరారు సత్యనారాయణ. అక్కడ ఎల్వీప్రసాద్ ని కలిశారు. ఆయన కైకాలను చూసి నీకు నటుడయ్యే లక్షణాలు ఉన్నాయి అని అన్నారు. అయితే మేము సినిమా మొదలుపెట్టడానికి రెండు నెలలు పడుతుంది, అప్పుడు రండి అని అన్నారు.

కైకాల వెనక్కి వెళ్లిపోకుండా, మద్రాస్ లోనే ఉండి అవకాశాల కోసం తిరిగారు. అలా తిరుగుతుండగా, కెబి.తిలక్ ఎం.ఎల్.ఏ అనే సినిమా తీస్తున్నారు. సత్యనారాయణను చూసి సెకండ్ హీరోగా అవకాశం ఇస్తా అన్నారు. కానీ ఆయన్ని కాదని, వేరే వ్యక్తికి ఇచ్చారు. భూకైలాస్ సినిమాలో కూడా అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. ఇలా అవకాశాలు రావడం, ఇక షూటింగ్ కి వెళ్తున్నా అనగా వేరే వాళ్ళకి అవకాశాలు వెళ్లిపోవడం జరిగేది. అందరూ నటుడయ్యే లక్షణాలు ఉన్నాయని అంటున్నారు, అవకాశం ఇస్తున్నారు. చివర్లో పక్కన పెట్టేస్తున్నారని మదన పడ్డారు. అయితే ఆయన ప్రయత్నం ఆపలేదు. రూమ్ మేట్ తో కలిసి ప్రయత్నాలు చేసేవారు. ఒకరోజు రూమ్ లో కాఫీ తాగుతుండగా కప్పు అడుగు భాగంలో సాలిపురుగు కనిపించింది. దీంతో రూమ్ మేట్స్ కైకాలను హాస్పిటల్ కు వెళ్ళు, సాలిపురుగు విషం చాలా ప్రమాదం అని అన్నారు. కానీ సత్యనారాయణ కంగారుపడలేదు. ఏం కాదులేవయ్యా, ఇవాళ నైట్ పడుకుంటాను. రేపు ఉదయం లేచి బతికాననుకో నటుడిగా జీవిస్తాను, లేదనుకో ఒక పురుగు చచ్చినట్టు అని పోతాను అని కైకాల విరక్తితో అన్నారు. కానీ అదృష్టం కొద్ది ఆయనకి ఏమీ కాలేదు. దీంతో ఆయన నటుడిగా గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయాణం మొదలుపెట్టారు.

అలా నాగిరెడ్డి, కె.వి.రెడ్డి, చక్రపాణి వంటి వారిని కలుసుకుంటూ వచ్చారు. వీళ్ళందరూ కైకాలలో టాలెంట్ ఉందని డిఎల్ నారాయణ దగ్గరకు పంపించారు. ఆయన కైకాలను చూసి నేను తీయబోయే సినిమాలో వేషం ఇస్తాను, అయితే మూడు సంవత్సరాల వరకూ చిన్న చిన్న వేషాలు వేయకూడదు, ఏ సినిమాలోనూ నటించకూడదు అని అన్నారు. మాతోనే ప్రయాణం చేయాలి అని అగ్రిమెంట్ చేయించుకున్నారు. కైకాల కూడా హీరోగా అవకాశం ఇచ్చినందుకు సంతోషంతో అగ్రిమెంట్ మీద సంతకం పెట్టారు. కైకాల సత్యనారాయణ హీరోగా, జమున హీరోయిన్ గా సిపాయి కూతురు సినిమా ప్రారంభమైంది. షూటింగ్ జరుగుతుండగా అక్కడకి వచ్చినవాళ్లు, కైకాలను చూసి ఎవరో కొత్త కుర్రాడంట, ఎన్టీఆర్ లా బాగా నటిస్తున్నారు అంటూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అది కాస్తా అప్పట్లో వైరల్ అయ్యి దర్శక, నిర్మాతల చెవిన పడింది. వాళ్ళు కైకాలను అప్రోచ్ అయ్యి మా సినిమాల్లో వేషం ఇస్తాము చేస్తారా అని అడిగారు. అయితే దానికి డి.ఎల్.నారాయణ ఒప్పుకోలేదు. మా సినిమా అయ్యేవరకూ వేరే సినిమాల్లో నటించడానికి వీల్లేదని అన్నారు. మూడు సంవత్సరాల వరకూ సత్యనారాయణ తమ ఆధీనంలోనే ఉంటాడని అన్నారు. దీంతో సత్యనారాయణ, వాళ్ళకి నో చెప్పాల్సివచ్చింది.

ఆ తర్వాత సినిమా పూర్తయ్యింది. రిలీజైంది. కానీ ఫ్లాప్ అయ్యింది. దీంతో అంతకు ముందు అవకాశాలు ఇస్తా అన్న వాళ్ళు ముందుకు రాలేదు. దీంతో కథ మళ్ళీ మొదటికి వచ్చింది. విసిగిపోయిన ఉన్న కైకాలకి విఠలాచార్య గారి రూపంలో ఒక విస్పోటనం లాంటి అవకాశం వచ్చింది. అయితే హీరోగా కాదు, విలన్ గా. ఒక ప్రముఖ సంస్థ నిర్మిస్తున్న “సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి” సినిమాలో కైకాలకు వేషం ఇమ్మని రికమండ్ చేశారు. అంతేకాకుండా కైకాలను హీరోగా కాకుండా, విలన్ గా చేయమని సలహా ఇచ్చారు. తెలుగులో విలన్ పాత్రలు చేసేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. నువ్వు విలన్ గా చేస్తే మంచి పేరు వస్తుంది అని చెప్పారు. కైకాల కూడా విలన్ గా నటిస్తానని చెప్పడంతో విఠలాచార్య ఆలోచించకుండా తన సినిమాలో అవకాశం ఇచ్చారు. కనకదుర్గ పూజా మహిమ సినిమాతో విలన్ గా పరిచయం అయిన కైకాల, ఆ సినిమా హిట్ అవ్వడంతో ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి, మదనకామరాజు కథ, అగ్గిపిడుగు ఇలా ఎన్నో సినిమాల్లో విలన్ గా మెప్పించారు.

అయితే అగ్గిపిడుగు సినిమాలో కైకాల సెకండ్ విలన్ గా నటించారు. ఆ సినిమాలో హీరో ఎన్టీఆర్ కావడం, సినిమా పెద్ద హిట్ అవ్వడం, కైకాలకు క్రేజ్ పెరగడం జరిగిపోయాయి. ఆ తర్వాత బిజీ ఆర్టిస్ట్ అయిపోయారు. అయితే కైకాల నటనకు ఇంప్రెస్ అయిన ఎన్టీఆర్, ఆయనలో మరో కోణాన్ని ఆవిష్కరించాలని “ఉమ్మడి కుటుంబం” సినిమాలో సాఫ్ట్ రోల్ లో నటింపజేశారు. దీంతో కైకాల రౌద్రమే కాదు, కరుణ రసాన్ని కూడా అద్భుతంగా పండించగలరని నిరూపించారు. అలా నిరూపించుకునేలా ఎన్టీఆర్ అవకాశం ఇచ్చారు. అలా కైకాల విలన్ గా, కేరెక్టర్ ఆర్టిస్ట్ గా వైవిద్యభరితమైన పాత్రలు వేస్తూ మెప్పిస్తూ వచ్చారు. అయితే ఇదంతా ఏదో ఒకరోజులోనో, వారం రోజుల్లోనో వచ్చింది కాదు. ఎన్నో రోజులు, ఎన్నో నెలలు వాళ్ళ చుట్టూ, వీళ్ళ చుట్టూ తిరిగి తిరిగి ఎన్నో కష్టాలు పడ్డారు. అందుకే నేటి తరానికి, రాబోయే కొన్ని తరాల వారికి కైకాల సత్యనారాయణ జీవితమే స్పూర్తి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here