ఈ దర్శకుడు ‘ప్రతిధ్వని’ చిత్రం మొదలుకొని అగ్రహీరోలతో సినిమాలు తీస్తూ.. హిట్ పై హిట్ కొడుతూ.. మంచి స్వింగ్ లో ఉన్నారు. అలా ‘అసెంబ్లీ రౌడీ’ చిత్రం విజయం తర్వాత త్రివిక్రమరావు, బి.గోపాల్ తో ఒక సినిమా చేయాలనుకున్నారు. ఆ క్రమంలో తమిళ సినిమాను తెలుగులో రీమేక్ చేద్దామని ఆలోచించారు. కానీ అప్పటికే ఆ సినిమాను కె.ఎస్.రామారావు తీసుకొని షూటింగ్ కూడా ప్రారంభించడంతో.. పుష్పానంద్ అందించిన కథ కొత్తగా ఉండటంతో ఆ సినిమానే చేద్దామనుకున్నారు.

పుష్పానంద్ రాసిన కథ, స్క్రీన్ ప్లే కి పరుచూరి బ్రదర్స్ మాటలు అందించారు. ఇన్స్పెక్టర్ ని రౌడీ అనడం ఏంటని విమర్శలు వచ్చినప్పటికీ.. రచయిత పుష్పానంద్ “రౌడీ ఇన్స్పెక్టర్” టైటిల్ అనుకునే కథ రాయడంతో సినిమాకి “రౌడీ ఇన్స్పెక్టర్” అనే టైటిల్ దర్శక, నిర్మాతలు ఫిక్స్ అయ్యారు.
1992, త్రివిక్రమరావు నిర్మాతగా, బి.గోపాల్ దర్శకత్వంలో రౌడీ ఇన్స్పెక్టర్ చిత్రం విడుదల అయ్యింది.

ఈ సినిమాలో బాలకృష్ణ, విజయశాంతి హీరో, హీరోయిన్లుగా నటించారు. సంగీత దర్శకుడు బప్పిలహరి పాటలతో మోతెక్కించాడు. పరుచూరి బ్రదర్స్ రాసిన డైలాగ్స్ థియేటర్లో ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించాయి. రెండోసారి బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన బాలకృష్ణ సినిమా ‘రౌడీ ఇన్స్పెక్టర్’ ఘన విజయం సాధించింది.

ఆ తర్వాత దర్శకుడు బి.గోపాల్ దాదాపు మూడు సంవత్సరాల తర్వాత సమాజంలో అన్యాయాన్ని ఎదిరించే ఓ పోలీస్ ఆఫీసర్ కథతో మొదటిసారిగా సుమన్ తో ఒక సినిమాను రూపొందించారు. రచయిత పోసాని కృష్ణమురళి కథ, స్క్రీన్ ప్లే, మాటలు ఈ సినిమాకు అందించారు. 1995, సిద్ధి వినాయక పిక్చర్స్, బి.గోపాల్ దర్శకత్వంలో ‘ఖైదీ ఇన్స్పెక్టర్’ చిత్రం విడుదలయింది. ఈ సినిమాలో సుమన్, రంభ, మహేశ్వరి హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో విలన్ గా రామ్ రెడ్డి నటించారు. సంగీత దర్శకుడు బప్పిలహరి మరోసారి బి.గోపాల్ దర్శకత్వంలో సూపర్ డూపర్ హిట్ పాటలు అందించారు. నేర చరిత్ర గల రౌడీలు రాజకీయాల్లోకి రావడం.. నేటి సమాజ దుస్థితి అనే కథాంశంతో వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద విజయవంతమయ్యింది. అలా ఈ రెండు చిత్రాలు బి.గోపాల్ దర్శకత్వంలో విడుదలై బాక్సాఫీస్ ను లూటీ చేశాయి.
































