తిరుపతిలో ఏర్పాటు చేసిన అమరావతి ఛాంపియన్‌షిప్ పోటీలను రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంపై విచారణ పూర్తయింది. త్వరలోనే బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటాం” అని స్పష్టం చేశారు.

టీడీపీ దేశంలోనే క్రమశిక్షణ కలిగిన పార్టీ అని మంత్రి తెలిపారు. ఎవరు తప్పు చేసినా వారిపై పారదర్శకంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. “పార్టీ అధిష్ఠానానికి అందరూ సమానమే, ఎవరూ ఎక్కువ, ఎవరూ తక్కువ కారు” అని రాంప్రసాద్ రెడ్డి వ్యాఖ్యానించారు.
గత వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో అవినీతి జరిగిందనే ఆరోపణలు వెలువడిన నేపథ్యంలో, కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. క్రీడా పరికరాల కొనుగోళ్లు, క్రీడాకారులకు వసతి కల్పించేందుకు కేటాయించిన నిధుల వినియోగంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి.
ఈ ఆరోపణలపై విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేసి నివేదిక సిద్ధం చేశారు. దానిపై ఆధారంగా త్వరలోనే బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమవుతోందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.





























