Perni Nani : వైసీపీ పార్టీకి ఇది నిజంగా పెద్ద ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. మాజీ మంత్రి పేర్ని నాని నివాసం వద్ద హడావుడిగా పరిస్థితులు నెలకొన్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, పోలీసులు మరికాసేపట్లో పేర్ని నానిని అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారట. ఈ వ్యవహారం వెనుక నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించిన కేసు ఉన్నట్లు తెలుస్తోంది.

పోలీసులు నమోదు చేసిన కేసులో పేర్ని నానితో పాటు ఆయన కుమారుడు కిట్టు కూడా ఈ అక్రమాల్లో భాగస్వాములని ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా పోలీసులకు లభించాయని సమాచారం. అయితే, ఈ అరెస్ట్‌ను నివారించేందుకు పేర్ని నాని ముందస్తుగా హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో గురువారం విచారణ జరగనుంది. కోర్టు తీర్పు కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉండగా, పేర్ని నాని కుమారుడు కిట్టు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో పేర్ని నాని తన అనుచరులు, కార్యకర్తలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో ఆయన నివాసం వద్దకు భారీ సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు, అభిమానులు చేరుకున్నారు. పరిస్థితి ఉత్కంఠగా మారింది. అసలేం జరుగుతుందో వేచి చూడాలి.



































