అందంగా కనిపించేందుకు నెయిల్ పాలిష్ వాడటం ఇప్పుడు మహిళల్లోనే కాదు యువతిలో కూడా సాధారణ అలవాటుగా మారిపోయింది. ప్రతి వారం కొత్త రంగులతో గోళ్లను అలంకరించుకోవడం ఫ్యాషన్ ట్రెండ్‌గా కొనసాగుతోంది. అయితే ఈ అందం వెనుక కొన్ని ఆరోగ్య సమస్యలు దాగి ఉన్నాయనే చర్చ ఇటీవల మళ్లీ మొదలైంది. ముఖ్యంగా నెయిల్ పాలిష్‌లో ఉపయోగించే కొన్ని రసాయనాలపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా నెయిల్ బ్యూటీ ఇండస్ట్రీ భారీ స్థాయిలో విస్తరిస్తోంది. ఈ ఉత్పత్తుల్లో ఫార్మాల్డిహైడ్, టోలుయిన్, డీబీపీ వంటి రసాయనాలు ఉపయోగిస్తారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిని ఎక్కువ కాలం పాటు నిరంతరం వాడటం వల్ల శరీరంపై ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రోజూ సలూన్లలో పని చేసే సిబ్బంది ఈ రసాయనాలను ఎక్కువగా పీల్చాల్సి వస్తుండటంతో వారికి ప్రమాదం అధికంగా ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు.
అప్పుడప్పుడు నెయిల్ పాలిష్ వేసుకునే వారికి పెద్దగా ముప్పు ఉండకపోవచ్చని నిపుణులు చెబుతున్నా, తరచూ వాడేవారు మాత్రం జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. నెయిల్ పాలిష్ త్వరగా ఆరేందుకు ఉపయోగించే యూవీ ల్యాంప్స్‌పై కూడా ఇటీవల కొన్ని అధ్యయనాలు దృష్టి సారించాయి. ఈ కిరణాలు చర్మ కణాలు, డీఎన్‌ఏపై ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే దీనిపై ఇంకా పూర్తి స్థాయి స్పష్టత రావాల్సి ఉంది.
ఆరోగ్య సమస్యలు దూరంగా ఉండాలంటే కొన్ని చిన్న జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. నెయిల్ పాలిష్ కొనుగోలు చేసే ముందు ‘5-ఫ్రీ’, ‘10-ఫ్రీ’ లేదా ‘13-ఫ్రీ’ లేబుల్ ఉన్న ఉత్పత్తులను ఎంపిక చేసుకోవడం మంచిదని చెబుతున్నారు. అలాగే ఫార్మాల్డిహైడ్, టోలుయిన్, కాంఫర్ వంటి రసాయనాలు లేని ఉత్పత్తులను వాడాలని సూచిస్తున్నారు. యూవీ ల్యాంప్స్ ఉపయోగించే ముందు చేతులకు సన్‌స్క్రీన్ రాసుకోవడం కూడా రక్షణ కలిగించవచ్చని వైద్యులు చెబుతున్నారు.
ఇక ప్రస్తుతం సహజసిద్ధమైన గోళ్లకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఎలాంటి పాలిష్ లేకుండా సహజంగా మెరిసే గోళ్లను చాలా మంది ప్రాధాన్యంగా చూస్తున్నారు. దీనివల్ల ఖర్చు తగ్గడమే కాకుండా గోళ్ల ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుందని బ్యూటీ నిపుణులు అంటున్నారు. అందం కోసం చేసే ప్రతి అలవాటులో ఆరోగ్య భద్రత కూడా అంతే ముఖ్యమని వైద్యులు గుర్తుచేస్తున్నారు.































