IT Minister Sridhar Babu: తెలంగాణ ఎన్నికల నేపథ్యం, బీఆర్‌ఎస్ ఓటమి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం తర్వాత ప్రజలు ఎక్కువగా చర్చించుకున్న విషయాలలో ఒకటి తరువాత ఐటీ మినిస్టర్ ఎవరు అని. ఐటీ మినిస్టర్ గా కేటిఆర్ తనదైన ముద్ర వేసుకున్నారు. ఐటీ ఉద్యోగుల నుండి ఆయన లేకపోవడం లోటుగానే ఉంటుందన్న వాదనలు కూడా వినిపించాయి. అయితే కేటీర్ కి ధీటుగా ఆ స్థానంలోకి అందరూ ముందు నుండి ఊహించినట్టుగానే కాంగ్రెస్ ప్రభుత్వం దుద్ధిల్ల శ్రీధర్ బాబుని ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖలు అప్పగించడం జరిగింది.

ఆల్ రౌండర్ శ్రీధర్ బాబు…
దుద్దిల్ల శ్రీధర్ బాబు 1969 మార్చి 30న ప్రముఖ కాంగ్రెస్ నేత అయిన మాజీ శాసనసభ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాద రావు, జయమ్మలకు జన్మించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో న్యాయవాద విద్యను అభ్యసించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 1998లో న్యాయవాద వృత్తిని చేపట్టారు. తన తండ్రి మరణంతో అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చిన శ్రీధర్ బాబు 1999లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. అంతే కాకుండా రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు, లీగల్ మెట్రాలజీ, శాసన వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంథని నుండి వరుసగా నాలుగు సార్లు గెలుపొందిన పీవీ నరసింహరావు గారి రికార్డును తిరగరాస్తూ అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది చరిత్ర సృష్టించారు. ఈయన గురించిన మరో ఆసక్తికర విషయం ఏంటంటే నిజాం కళాశాలలో చదివేటప్పుడు హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి క్రికెట్‌లో ప్రాతినిధ్యం కూడా వహించారు. ఇలా అన్నింట్లో ఆల్ రౌండర్ గా ఉండి, మంచి నాయకుడిగా కూడా నిరూపించుకున్న శ్రీధర్ బాబు ఐటీ మంత్రిగా కూడా రాణిస్తారని అందరూ కోరుకుంటున్నారు.

































