YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు పూర్తి అయిన తర్వాత తన ఫ్యామిలీతో కలిసి లండన్ పర్యటన వెళ్లిన సంగతి మనకు తెలిసిందే. మే 13వ తేదీ ఎన్నికలు పూర్తికాగా 17వ తేదీ ఈయన లండన్ వెళ్లారు. అయితే నేడు జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన ముగించుకుని తిరిగి తాడేపల్లికి చేరుకున్నారు.

ఈయన లండన్ పర్యటన పూర్తి చేసుకొని తిరిగి వచ్చిన నేపథ్యంలో పలువురు కీలక నేతలు విమానాశ్రయంలోనే జగన్మోహన్ రెడ్డిని కలిసి ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇక జగన్ లండన్ పర్యటన నుంచి నేరుగా తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కు చేరుకున్నారు.
గత రెండు వారాలుగా ఆంధ్రప్రదేశ్ కి దూరంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తిరిగి రావడంతో వెంటనే ఈయన తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైసిపి కీలక నేతలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో భాగంగా ఎన్నికల ఫలితాలపై కొన్ని దిశా నిర్దేశాలు చేశారని తెలుస్తోంది.
మరి కొన్ని గంటలలో ఎగ్జిట్ పోల్స్ రాబోతున్న నేపథ్యంలో జగన్ ముఖ్య నేతలతో ఈ భేటీ నిర్వహించారు. అయితే ఇప్పటికే పలు సంస్థలతో సర్వేలు చేయించినటువంటి ఈయన ఈసారి కూడా తమకే అనుకూలంగా ఉందని తను లండన్ వెళ్ళటానికి ముందే వచ్చేది మన ప్రభుత్వమే అని తెలియజేశారు.
వచ్చేది వైసీపీనే…
పలు సర్వేలు వెల్లడించిన ఫలితాలలో 2019 ఎన్నికల సమయంలో వచ్చినటువంటి సీట్ల కంటే మరికొన్ని ఎక్కువగానే రాబోతున్నాయని జగన్ ధీమా వ్యక్తం చేశారు. ఇక ఎన్నికల కౌంటింగ్ రోజు ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి ఘటనలు అల్లర్లు చోటు చేసుకోకుండా ఉండాలని ఈయన నేతలకు సలహాలు సూచనలు ఇచ్చారని తెలుస్తోంది.





























