ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీల్లో అమ్మఒడి కూడా ఒకటి. జగన్ సర్కార్ అమ్మఒడి స్కీమ్ ద్వారా ప్రభుత్వ ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినీవిద్యార్థుల తల్లి ఖాతాల్లో 15,000 రూపాయల చొప్పున జమ చేస్తోంది. ఈ ఏడాది జనవరి 9వ తేదీన అమ్మఒడి తొలి విడత నగదు ఖాతాల్లో జమ కాగా వచ్చే ఏడాది జనవరి 9వ తేదీనే మళ్లీ విద్యార్థినీవిద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ కానుంది.

అమ్మఒడి స్కీమ్ ద్వారా జగన్ సర్కార్ విద్యార్థులకు అన్ని విధాలుగా ప్రయోజనం కలుగుతుందని భావిస్తోంది. జగనన్న అమ్మ ఒడి స్కీమ్ కు అర్హత పొందేందుకు ఈ నెల 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 16వ తేదీ నుంచి విడతల వారీగా లబ్ధిదారుల ప్రాథమిక జాబితా విడుదలవుతుంది. జాబితాలో ఏమైనా తప్పులు ఉంటే లబ్ధిదారులు 20వ తేదీ నుంచి 24వ తేదీలోగా తప్పులను సవరించుకోవచ్చు.

ఈ నెల 26వ తేదీన అమ్మఒడి జాబితా ఫైనల్ అవుతుంది. ఈ నెల 31వ తేదీన ఫైనల్ అయిన అమ్మఒడి జాబితాకు కలెక్టర్లు ఆమోదం తెలుపుతారు. ఆమోదం పొందిన అమ్మఒడి లబ్ధిదారుల తుది జాబితాలోని లబ్ధిదారులకు జనవరి 9వ తేదీన ప్రభుత్వం నగదు జమ చేస్తోంది. కొత్తగా దరఖాస్తు చేసుకునే వాళ్లు విద్యార్థులు చదివే పాఠశాల అధ్యాపకులకు అవసరమైన ధ్రువపత్రాలు అందజేసి ఈ స్కీమ్ కు అర్హత పొందవచ్చు.

గతేడాది అమ్మఒడి స్కీమ్ ద్వారా 43,54,600 మంది విద్యార్థులు ప్రయోజనం పొందారు. ప్రభుత్వం గతేడాది ఈ స్కీమ్ కోసం ఏకంగా 6,336 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. త్వరలో డీఎస్సీ పోస్టులను కూడా భర్తీ చేస్తామని ఆయన ప్రకటన చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here