Milk Jewellery: కొందరికి చిన్నతనంలో చేసిన కొన్ని చిలిపి జ్ఞాపకాలను పదిలంగా ఉంచుకోవాలని కోరుకుంటారు. వాటి తాలూకా ఏమైనా ఫొటోలు ఉంటే.. భద్రంగా దాచుకుంటారు. అవి ఎప్పటికీ గుర్తుండి పోవాలి అని.. ఇంట్లోనే ఓ చిన్న పెట్టెలల్లో దాచుకుంటారు. అయితే అమ్మతనం జ్ఞాపకాల్ని ఎప్పటికీ గుర్తుంచుకోవాలి అనుకునే వాళ్లకు.. ఇక్కడ చెప్పే ఈ న్యూస్ ఎంతగానో ఉపయోగపడుతుంది.

తల్లిపాలతో జువెలరీని తయారు చేస్తున్నారు ఇద్దరు ఆర్టిస్టులు. దాని గురించి వివరాల్లోకి వెళ్తే.. చెన్నైకి చెందిన ఆర్టిస్ట్ ప్రీతి విజయ్‌కి చిన్నప్పటి నుంచి ఆర్ట్, క్రాఫ్ట్ వర్క్ అంటే ఇష్టం. ఆమె డిగ్రీ చదివిన తర్వాత పాలిమర్, మట్టి కలిపి తయారుచేసిన బొమ్మలు అమ్మడం మొదలుపెట్టింది. అయితే ఆమె దగ్గరకు వచ్చిన కొందరు తల్లిపాలతో తయారు చేసిన జువెలరీ కావాలని అడిగేవారట.

దాంతో అప్పటినుంచి ‘మొమ్మాస్ మిల్కీ లవ్’ పేరుతో రకరకాల డిజైన్లలో ఉన్న ఉంగరాలు, చెవి కమ్మలు, పెండెంట్స్ అమ్ముతోంది. అయితే ఆ మెటీరియల్, డిజైన్లను బట్టి ఆమె వాటి ధరను రూ.వెయ్యి నుంచి రూ.4 వేల లోపు ఫిక్స్ చేసింది. ఇలా ఆమె జువెలరీని.. అమెరికాకు చెందిన సారా కాస్టిల్లో ఇన్ స్టాగ్రామ్ లో చూసింది. దీంతో ఆమె కూడా ఆ బిజినెస్ లోకి రావాలనిపించడంతో.. ఆమెను సంప్రదించి వివరాలను కనుక్కోంది.
ధర 60 నుంచి 150 డాలర్లు..
ఎలా తయారు చేస్తారో తెలుసుకొని.. విజయవంతంగా..ఈ ఏడాది మార్చిలో ‘కీప్‌సేక్స్ బై గ్రేస్’ అనే కంపెనీ పెట్టింది. ధరను 60 నుంచి 150 డాలర్లకు ఫిక్స్ చేసింది. ఇలా వీళ్లిద్దరూ పాపులర్ అయ్యారు. వీటిని ఎలా తయారు చేస్తారంటే.. తల్లిపాలని ఎండలో ఉంచి.. వాటిని బాగా ఇగుర్చుతారు. దాంతో పాలు పిండిలా మారతాయి. ఆ పిండిలో రెసిన్ అనే జిగురు పదార్థాన్ని కలిపి.. రాయిగా మారుస్తారు. తర్వాత కస్టమర్లు కోరిన డిజైన్‌లో పెండెంట్, రింగ్స్ తయారుచేసి అందిస్తారు. వీటికి ప్రస్తుతం విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.































