సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా తెరకెక్కించేటప్పుడు నటీనటులు ఎక్కువ టేక్ లు తీసుకుంటే డైరెక్టర్లు వారిపై కొంతమేర ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారనే సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే నటీనటులు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని ఒక సీన్ ఎక్కువ టేకులు తీయకుండా వీలైనంత తొందరగా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. సినిమా ఇండస్ట్రీలో ఒక లెజెండ్ గా యావత్ దేశం మొత్తం అభిమానించే హీరోగా, నటనలో తనకు ఎవరూ సాటి లేరన్న పేరు సంపాదించుకున్న నటుడు రజనీకాంత్ ఓ టెకులో సరిగా నటించకపోవడంతో ఏకంగా డైరెక్టర్ అతనిపై చేయి చేసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు ఆ సంగతులు ఏమిటి అనే విషయాలను తెలుసుకుందాం..

తమిళ సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న రజినీకాంత్ మొట్టమొదటిసారిగా కె.బాలచందర్ దర్శకత్వంలో తెరకెక్కిన “అపూర్వ రాగంగళ్” సినిమాతో నటునిగా వెండితెర పై అడుగు పెట్టాడు. రజినీకాంత్ బాలచందర్ దర్శకత్వంలో చేసిన సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే రజనీకాంత్ శ్రీదేవి జంటగా మొట్టమొదటిసారి బాలచందర్ దర్శకత్వంల ‘మూండ్రు ముడిచ్చు’ అనే సినిమాలో నటించారు. అప్పటికి శ్రీదేవి వయసు 13 సంవత్సరాలు.

బాలచందర్ దర్శకత్వంలో నటించే నటీనటులు ఎంతో జాగ్రత్తగా నటిస్తారు. ఎందుకంటే నటీనటులు ఒక సన్నివేశం కోసం ఎక్కువ టేకులు తీసుకుంటే అతనికి నచ్చదు. అయితే నటీనటులు అద్భుతంగా నటిస్తే మాత్రం వారిని “వెరీగుడ్” అంటూ ప్రశంసించే వారు. ఈ క్రమంలోనే ఈ సినిమాలో శ్రీదేవి రజనీకాంత్ ఇద్దరు పోటీ పెట్టుకొని మరి నటించారు.

ఈ సినిమాలో ఒక సన్నివేశం తీసే సమయంలో రజినీకాంత్ అధిక టేకులు తీసుకొని సరిగా నటించకపోవడంతో బాలచందర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ రజిని పై చేయి చేసుకున్నట్లు అప్పట్లో ఓ ఇంటర్వ్యూ ద్వారా శ్రీదేవి ఈ విషయాన్ని వెల్లడించారు. శ్రీదేవి కూడా ఒక సన్నివేశం కోసం ఏకంగా 13 టేకులు తీసుకున్నారని 14వ టేక్ కి దర్శకుడు ఓకే చెప్పినట్లు తెలిపారు. మరొక విషయం ఏమిటంటే ఈ సినిమాలో రజనీకాంత్ కన్నా శ్రీదేవికి ఎక్కువ రెమ్యూనరేషన్ ఇవ్వడం గమనార్హం.































