టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ హీరోయిన్ల జాబితాను పరిశీలిస్తే అందులో కాజల్ అగర్వాల్ పేరు ముందువరసలో ఉంటుంది. చెల్లి నిషా అగర్వాల్ చాలా సంవత్సరాల క్రితమే పెళ్లి చేసుకున్నా కాజల్ మాత్రం పెళ్లిపై పెద్దగా ఇష్టం చూపించలేదు. లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కాజల్ మగధీర సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.

అయితే ఇంతకాలం సినిమాలకే ప్రథమ ప్రాధాన్యత ఇచ్చిన కాజల్ ఇప్పుడు పెళ్లిపై మనస్సు పారేసుకుందని తెలుస్తోంది. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో సైతం గుర్తింపు తెచ్చుకున్న కాజల్ ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కనుంది. ముంబైకి చెందిన బిజినెస్ మేన్ తో కాజల్ వివాహం జరగనుందని తెలుస్తోంది. కాజల్ కు కాబోయే భర్త పేరు గౌతమ్ కిచ్లు అని సమాచారం.

ఇంటీరియర్ డిజైనర్ అయిన గౌతమ్ కు హోం ఫర్నిషింగ్ బిజినెస్ కూడా ఉంది. కలువ కళ్ల కాజల్, గౌతమ్ జంట బాగుంటుందని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తవుతున్నాయి. కాజల్ కు కాబోయే భర్త అంటూ గౌతమ్ ఫోటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల ఈ నెల 30వ తేదీన పరిమిత సంఖ్యలో అతిథులతో కాజల్ వివాహ వేడుక జరగనుంది.

50కు పైగా సినిమాల్లో హీరోయిన్ గా నటించిన కాజల్ అగర్వాల్ నటించిన సినిమాల్లో మెజారిటీ సినిమాలు హిట్లు, బ్లాక్ బస్టర్ హిట్లు కావడం గమనార్హం. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 14 సంవత్సరాలైనా కాజల్ కు అవకాశాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ ఆచార్య, మోసగాళ్లు సినిమాలతో పాటు ఇండియన్ 2 సినిమాలో కూడా నటిస్తోంది.































