ఎవరికైనా అధికారం అనేది పేదలకు సేవ చేయడానికి మాత్రమే ఉంటుంది. దానిని దుర్వినియోగం చేస్తే.. ఈ రోజు కాకపోయినా రేపటి రోజైనా దానికి తగిన శిక్షను అనుభవిస్తారు. ఇందులో భాగంగానే టీఆర్ఎస్ గ్రామ సర్పంచ్ ను గ్రామ సమస్యలపై నిలదీసినందుకు గ్రామస్తుడిని కాలితో తన్నిన ఘటన కలకలం రేపింది.

అంతే కాకుండా అతడిని పిడిగుద్దులు కూడా గుద్దాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ జిల్లా మార్పల్లి మండలం.. దామస్తాపూర్ గ్రామంలో డ్రైనేజీ, మంచినీటి సమస్య ఉందని వెళ్లి గ్రామ సర్పంచ్ జైపాల్ రెడ్డిని అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి వెళ్లి కలిశాడు. ఈ సమస్యలతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారని.. సమస్యలను పరిష్కరించాలిన కోరాడు.
నన్నే ప్రశ్నిస్తావా అంటూ ఆ సర్పంచ్ ఆగ్రహంతో ఊగిపోయాడు.. ఆ కోపంతోనే అతడిని కాలితో తన్నాడు. అంతే కాకుండా అసభ్యపదజాలంతో దూషిస్తూ.. కిందపడేసి పిడిగుద్దులు గుద్దాడు. ఈ గొడవ అంతా చూస్తున్న అక్కడ గ్రామస్తులు గొడవను ఆపే ప్రయత్నం చేశారు. వాళ్లు ఆపుతున్న క్రమంలో కూడా ఇతరులకు చిన్నిపాటి గాయాలు అయ్యాయి.
ఎట్టకేలకు ఆ గొడవను గ్రామస్తులు ఆపారు. తర్వాత శ్రీనివాస్ రెడ్డి తనపై గ్రామ సర్పంచ్ దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడని.. అంతే కాకుండా ఇష్టం వచ్చినట్లు తిట్టాడని వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇలా గ్రామ సమస్యలపై ప్రశ్నించినందుకు సర్పంచ్ అతడిపై దాడికి దిగిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.































