కరోనా మహమ్మారి విజృంభణ దేశంలోని వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ రంగం ఆ రంగం అనే తేడాల్లేకుండా అన్ని రంగాలకు చెందిన వ్యాపారులు లాక్ డౌన్ వల్ల తీవ్రంగా నష్టపోయారు . చాలామంది వ్యాపారులకు లాక్ డౌన్ వల్ల లక్షల్లో నష్టం వాటిల్లింది. దీంతో చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక చాలామంది వ్యాపారులు ఉన్న ఆస్తులను అమ్మేసుకుంటున్నారు. కేంద్రం మారటోరియం ప్రయోజనాలను కల్పించినా వాటి వల్ల లాభం పొందిన వారి సంఖ్య చాలా తక్కువ.

చేసిన అప్పులు తీరకపోవడంతో చాలామంది తప్పనిసరి పరిస్థితుల్లో శరీరంలోని అవయవాలను అమ్మేయాలని చూస్తున్నారు. తాజాగా కశ్మీర్ కు చెందిన వ్యాపారి ఏకంగా తన కిడ్నీలను అమ్మాలనుకుంటున్నానని పేపర్ లో యాడ్ ఇచ్చాడు. 91 లక్షల రూపాయలు అప్పు చేసిన వ్యాపారికి అప్పును ఏ విధంగా తీర్చాలో అర్థం కాలేదు. కిడ్నీ అవసరం ఉన్నవారు తనను సంప్రదించమని అతను పేపర్ లో యాడ్ ఇచ్చాడు.
పూర్తి వివరాల్లోకి వెళితే కశ్మీర్ లోని కుల్గమ్ జిల్లాకు చెందిన సబ్జర్ అహ్మద్ ఖాన్ కారు డీలర్ గా పని చేసేవాడు. లాక్ డౌన్ వల్ల వ్యాపారంలో అప్పటివరకు సంపాదించిన డబ్బు మొత్తం అహ్మద్ కోల్పోయాడు. ఆర్టికల్ 370 సమయంలో లాక్ డౌన్ అమలు వల్ల నష్టపోయిన వ్యాపారి కరోనా వల్ల మరింత నష్టపోయాడు. అయితే పేపర్ యాడ్ వైరల్ కావడంతో పోలీసులు వ్యాపారిని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారని తెలుస్తోంది.
మన దేశ చట్టాల ప్రకారం అవయవాలను విక్రయించడం నేరం కావడంతో పోలీసులు వ్యాపారిని సున్నితంగా హెచ్చరించారని దీంతో సదరు వ్యాపారి కిడ్నీ అమ్మాలనే ఆలోచనను విరమించుకున్నాడని తెలుస్తోంది.



























