ఫోన్ లోనే ఆక్సిజన్ స్థాయి ఇలా తెలుసుకోండి..?

0
797

ప్రస్తుతం కరోనా రెండవ దశ మన దేశంలో తీవ్రరూపం దాలుస్తోంది. ఈ వైరస్ బారిన పడి ఎంతో మంది ప్రజలు చిగురుటాకులా హడలిపోతున్నారు.రోజురోజుకు వ్యాధి తీవ్రత అధికంగా ఉండడంతో ఎంతోమంది ఈ మహమ్మారి బారిన పడటమే కాకుండా ఆస్పత్రిలో సరైన ఆక్సిజన్ అందక మృత్యువాత పడుతున్నారు. ఈ క్రమంలోనే మన శరీరంలో రోజుకు మూడు సార్లు ఆక్సిజన్ స్థాయిలను చెక్ చేసుకోవడం వల్ల మన ఆరోగ్య పరిస్థితి గురించి అంచనాకు రావచ్చు.

ఈ నేపథ్యంలోనే మార్కెట్లో పల్స్‌ ఆక్సీమీటర్లు, స్మార్ట్‌ వాచ్‌లకు ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగిపోయింది. దీంతో అమాంతంగా వాటి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ క్రమంలోనే కోల్‌కతాకు చెందిన ‘కేర్‌ నౌ హెల్త్‌కేర్‌’ అనే అంకుర సంస్థ ‘కేర్‌ప్లిక్స్‌ వైటల్స్‌ యాప్‌’ కి రూపకల్పన చేసింది.ఫోటో ప్లెథిస్మోగ్రఫీ టెక్నాలజీతో, కృత్రిమ మేధ సాయంతో కేర్‌ప్లిక్స్‌ వైటల్స్‌ యాప్‌ పనిచేస్తుంది.

సాధారణంగా మనం ఆక్సీమీటర్లలో ఇన్‌ఫ్రారెడ్‌ లైట్‌ సెన్సార్లు ఉంటాయి. కానీ ఈ యాప్‌లో కేవలం మన ఫోన్‌లోని ఫ్లాష్ లైట్ ద్వారా మన శరీరంలోని ఆక్సిజన్ స్థాయిలను తెలుసుకోవచ్చు. ఈ యాప్ ని ఓపెన్ చేసి మన ఫోన్ లో ఫ్లాష్ లైట్ ఆన్ చేయాలి. ఫ్లాష్లైట్ వెనుక భాగాన మన వేలిని పెట్టీ, స్కాన్ బటన్ నొక్కగానే కేవలం 40 సెకండ్లో మన శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు,పల్స్‌, శ్వాసక్రియ రేట్లను యాప్‌లో చూపిస్తుందని కేర్‌నౌ హెల్త్‌కేర్‌ సహవ్యవస్థాపకుడు శుభబ్రాతా పాల్‌ తెలిపారు.

ఈ యాప్ కనుగొన్న తరువాత గత ఏడాది వీటిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించగా 96 శాతం ఇది ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుందని పాల్‌ తెలియజేశారు. ప్రస్తుతం ఈ యాప్ కేవలం ఐవోఎస్‌ వినియోగదారుల కోసం యాప్‌స్టోర్‌లో అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్‌ యూజర్ల కోసం అయితే వెబ్‌సైట్‌లో ఏపీకేను అందుబాటులోకి ఇచ్చారు. ఈ యాప్ త్వరలో ప్లే స్టోర్‌లోకి తీసుకొస్తారని సమాచారం.