Kota Srinivasa Rao: విలక్షణ నటుడిగా సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటించి నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న కోట శ్రీనివాస్ రావు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఈయన వయసు పైబడటంతో సినిమాలలో నటించలేక ఇంటికే పరిమితమయ్యారు. ఈ క్రమంలోనే యూట్యూబ్ ఛానల్ లకు ఇంటర్వ్యూ ఇస్తూ పలు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఈ విధంగా కోట శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇక మా ఎన్నికల సమయంలో యాంకర్ అనసూయ వస్త్రధారణ గురించి కూడా కోట శ్రీనివాసరావు కామెంట్ చేశారు. ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కోట శ్రీనివాస్ రావు మెగాస్టార్ చిరంజీవి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

మెగాస్టార్ చిరంజీవి మే 1 న కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కార్మికుల దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ సినీ కార్మికుల కోసం తాను చిత్రపురిలో అన్ని సదుపాయాలు కలిగినటువంటి ఆసుపత్రిని నిర్మిస్తానని వెల్లడించారు.తాను ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ తను ఒక కళాకారుడు కాదని ఎప్పటికీ తాను సినీ కార్మికుడిననీ చిరంజీవి ఈ సందర్భంగా వెల్లడించారు.
తాజాగా ఈ వ్యాఖ్యలపై కోటశ్రీనివాసరావు స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్ చిరంజీవి చిత్రపురిలో ముందుగా కట్టాల్సింది ఆస్పత్రి కాదు. నువ్వు అక్కడ ఆస్పత్రి కడితే ఎవరు వెళ్లి చికిత్స చేయించుకుంటారు… ఆసుపత్రి కన్నా ముందు కృష్ణానగర్ లో ఎంతో మంది ఆర్టిస్టులు అవకాశాలు లేక ఆకలి మంటలతో అలమటిస్తున్నారు. అవకాశాలు లేక చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నారు. ముందుగా వారి ఆకలి బాధలను తీర్చడానికి ఫుడ్డు పెట్టండి అంటూ కామెంట్ చేశారు.
అలాంటి మాటలు నాకు నచ్చవు…
డబ్బు ఉన్న వాళ్ళు ఏదైనా ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకుంటారు కానీ అక్కడికి వెళ్లి ఎందుకు చికిత్స చేయించుకుంటారు అంటూ కోట ప్రశ్నించారు. కోట్ల రూపాయల పారితోషికం తీసుకునే మెగాస్టార్ చిరంజీవి సినీ కార్మికుడు ఎలా అవుతారని ప్రశ్నించారు. తనకు అలాంటి మాటలని ఏమాత్రం నచ్చదని కానీ ఆయనంటే గౌరవమని కోట శ్రీనివాసరావు మెగాస్టార్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం కోట చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

































