సాధారణంగా సినిమా హీరోలు రిటైర్మెంట్ అనంతరం తమ కొడుకులను సినీ వారసులుగా ఎంట్రీ చేయిస్తుంటారు. కానీ కూతుర్లు అందుకు మినహాయింపుగా ఉంటారు. దీనికి దక్షిణ, ఉత్తరాది సినీ పరిశ్రమలు మినహాయింపేమీ కాదు. హీరోల వారసురాలిగా హీరోయిన్స్ రావడం అనేది చాలా తక్కువగా జరుగుతూ ఉంటుంది. తండ్రి వారసత్వం తో వచ్చిన హీరో, హీరోయిన్స్ సినీ ఫీల్డ్ లోకి రావడం వరకు మాత్రమే పనిచేస్తుంది. ఆ తర్వాత నటనలో కొత్తదనం, సంభాషణల్లో నైపుణ్యత లేనట్లయితే వారి భవిష్యత్తు గందరగోళంలో పడుతుంది.

అలా ఎంతో మంది వారసులుగా వచ్చి తమ సినీ భవిష్యత్తును పరీక్షించుకొని నెగ్గిన వాళ్ళు ఉన్నారు. అందులో ఓడిపోయి తిరుగుముఖం పట్టిన వాళ్ళు ఉన్నారు. ఇది పూర్తిగా వారి ప్రతిభపై ఆధారపడి ఉంటుంది. అయితే సూపర్ స్టార్ కృష్ణ వెండితెరపై వందల చిత్రాల్లో నటించి ప్రేక్షకుల గుండెల్లో నిలిచి పోయారు. ఆయన వయసు పైబడటం తో తన కొడుకులను రమేష్ బాబు, మహేష్ బాబు లను సినీపరిశ్రమలోకి తీసుకువచ్చారు. రమేష్ బాబు బాలనటుడిగా పరిచయమై హీరోగా కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ ఆ తర్వాత పెద్ద సక్సెస్ సినిమాలు లేకపోవడంతో ఆయన సినిమాల నుండి తిరుగుముఖం పట్టారు. మహేష్ బాబు కూడా బాలనటుడిగా కృష్ణ తో నటించి, ఆ తర్వాత రాజకుమారుడు సినిమా తో హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యారు.

ఆ సినిమా తర్వాత మహేష్ బాబు అనేక సూపర్ హిట్ సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ క్రమంలో కృష్ణ కుమార్తె మంజుల కూడా సినిమాల్లో నటించాలనుకున్నారు. అదే విషయం ఆమె నాన్నగారైన కృష్ణ తో చెప్పడం, దానికి ఆయన కూడా అంగీకరించడం జరిగింది. అలా మంజుల విషయాన్ని కృష్ణ గారు ఎస్.వి.కృష్ణారెడ్డి తో చెప్పగా ఆయన తీసే టాప్ హీరో చిత్రంలో బాలకృష్ణ సరసన హీరోయిన్ గా అవకాశం ఇద్దాం అనుకున్నారు. ఇలా కృష్ణ కుమార్తె మంజుల మనం తీయబోయే టాప్ హీరో సినిమాలో నటిస్తుందని ఎస్.వి కృష్ణారెడ్డి, బాలకృష్ణతో చెప్పగా ఆయన కూడా అంగీకరించారు.

అయితే విషయం తెలుసుకున్న కృష్ణ అభిమానులు మంజుల వేరే హీరోలతో హీరోయిన్ గా డ్యూయెట్ లు చేయడమేంటని.. వాహనాల్లో పెద్ద ఎత్తున కృష్ణ ఇంటికి చేరుకోవడం జరిగింది. ఒకవేళ బాలకృష్ణ సరసన మంజుల నటించినట్లయితే తాము ఆత్మహత్య చేసుకుంటామని కృష్ణ ఇంటి ముందు అభిమానులు బైఠాయించారు. అప్పుడు మంజుల టాప్ హీరో చిత్రంలో హీరోయిన్ గా నటించదు అని కృష్ణ చెప్పడంతో ఆయన అభిమానులు తిరిగి వెళ్ళిపోయారు. ఆ తర్వాత తెలుగు లో నటిస్తే అభిమానులతో ఇబ్బంది ఉంటుందని మలయాళంలో ప్రముఖ నటుడు నంబియార్ మనవడు దీపక్ సరసన ఒక సినిమాలో హీరోయిన్‌గా అవకాశం వచ్చినా ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. అ తర్వాత నీలకంఠ దర్శకత్వంలో షో అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత నాని, కావ్యాస్ డైరీ, పోకిరి, ఏ మాయ చేసావే వంటి చిత్రాలను నిర్మించారు.


































