గత రెండు రోజుల నుంచి తెలంగాణలో పలు జిల్లాలో వానలు విస్తారంగా కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే పలు నగరాలు జల సందిగ్ధంలో మునిగిపోయాయి. ఎడతెరిపి లేకుండా వానలు కురవడంతో వాగులు వంకలు పొంగడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈ క్రమంలోనే నిర్మల్ జిల్లా మొత్తం వరద నీరు వచ్చి చేరడంతో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి.

ఈ విధంగా అధిక వర్షాలు కురవడంతో రోడ్లపైకి నీళ్లు రావడం వల్ల చెరువులో ఉన్నటువంటి చేపలని రోడ్డుపైకి కొట్టుకు వచ్చాయి.ఈ విధంగా రోడ్డుపైకి చేపలు రావడంతో వాటిని చూసిన జనాలు చేపలు పట్టు కోవడం కోసం పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. దొరికిన వారికి దొరికినన్ని చేపలను పట్టుకుని ఇంటికి వెళ్తున్నారు.
ఈ విధంగా వరద నీటిలో కొట్టుకు వచ్చిన చేపలు 1కిలో రెండు కిలోల వరకు బరువు ఉన్నాయని స్థానిక ప్రజలు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే గత మూడు రోజుల నుంచి దంచికొడుతున్న వర్షాల వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న జిల్లా ప్రజలకు తక్షణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
మరో రెండు రోజులపాటు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు ఎలాంటి పరిస్థితులలో బయటకు రాకూడదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
నిర్మల్ జిల్లా భైంసాలోని గడ్డెన వాగు పూర్తిగా నిండిపోయింది. దీంతో ఐదు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదలడంతో ఈ నీటి ప్రవాహానికి ఆటోనగర్‌ను వరద నీరు చేరడంతో సుమారు 40 మంది వరకు గల్లంతైనట్లు అధికారులు గుర్తించారు.































