ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ లేకుండా రోజు గడవడం చాలా మందికి కష్టంగా మారింది. ఉద్యోగం, చదువు, వినోదం, సోషల్ మీడియా.. ఇలా ప్రతి పనికీ స్క్రీన్‌లపై ఆధారపడటం పెరిగిపోయింది. అయితే రోజుకు గంటల తరబడి మొబైల్, ల్యాప్‌టాప్, టీవీ స్క్రీన్‌లను చూడటం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మైగ్రేన్ తలనొప్పుల సమస్య వేగంగా పెరుగుతోందని చెబుతున్నారు.

స్క్రీన్‌ల నుంచి వెలువడే నీలి కాంతి కళ్లపై ఒత్తిడి పెంచుతుందని నిపుణులు వివరిస్తున్నారు. ఎక్కువసేపు స్క్రీన్‌ను చూడటం వల్ల కళ్లలో అలసట, పొడిబారడం, మంట వంటి సమస్యలు మొదలవుతాయి. ఈ ఒత్తిడి క్రమంగా మెదడుపై ప్రభావం చూపి తీవ్రమైన తలనొప్పులకు దారితీస్తుందని చెబుతున్నారు.
మైగ్రేన్‌తో బాధపడేవారిలో స్క్రీన్ టైమ్ ఎక్కువగా ఉంటే సమస్య మరింత తీవ్రం కావచ్చని వైద్యులు సూచిస్తున్నారు. కొందరికి వెలుగు చూడలేకపోవడం, తల బరువుగా అనిపించడం, కళ్ల ముందు మినుకుమినుకులు కనిపించడం వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చని చెబుతున్నారు.
ప్రత్యేకంగా ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, గంటల తరబడి మొబైల్ వాడే యువత ఎక్కువ ప్రమాదంలో ఉన్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రి వేళల్లో ఫోన్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల నిద్రలేమి సమస్య కూడా పెరుగుతోంది. సరైన నిద్ర లేకపోవడం కూడా మైగ్రేన్‌కు ఒక కారణంగా మారుతోంది.
ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారం ప్రతి 20 నిమిషాలకు ఒకసారి స్క్రీన్ నుంచి కళ్లకు విరామం ఇవ్వాలి. మొబైల్ బ్రైట్‌నెస్‌ను తగ్గించడం, బ్లూ లైట్ ఫిల్టర్ వాడటం, రాత్రి వేళల్లో స్క్రీన్ టైమ్ తగ్గించడం మంచిదని సూచిస్తున్నారు. అలాగే తగినంత నీరు తాగడం, సరైన నిద్ర తీసుకోవడం కూడా తలనొప్పులను తగ్గించడంలో సహాయపడతాయని చెబుతున్నారు.



























