కాలం మారే కొద్దీ దేశంలో వ్యవసాయంపై ఆసక్తి చూపే వారి సంఖ్య అంతకంతకూ తగ్గుతోంది. చాలామంది విద్యార్థులు కార్పొరేట్ కొలువులు చేయడానికే ఆసక్తి చూపుతున్నారు. మంచి వేతనం ఉన్న ఉద్యోగం దొరకకపోతే తక్కువ వేతనం ఉన్నా వ్యవసాయం చేయడానికే యువత ఆసక్తి చూపుతున్నారు. అయితే ఒక వ్యక్తి మాత్రం సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని వదిలి వ్యవసాయం వేపు వెళ్లాడు. సంవత్సరానికి కోట్లలో సంపాదిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.

మహారాష్ట్రలోని దౌండ్ గ్రామానికి చెందిన సమీర్ డోంబే ఏడేళ్ల క్రితం ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేశారు. అయితే కొంతకాలం తరువాత అతనికి ఆ ఉద్యోగం నచ్చలేదు. వ్యవసాయ కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో అతనికి వ్యవసాయం చేయాలనే ఆలోచన వచ్చింది. అనుకున్నదే తడవుగా ఉద్యోగాన్ని వదిలి సమీర్ వ్యవసాయం వైపు అడుగులు వేయాలని అనుకున్నాడు. అయితే అతని నిర్ణయాన్ని అందరూ తప్పుబట్టారు.
అయితే అతను మాత్రం ఇతరుల గురించి ఆలోచించకుండా తనకు ఉన్న రెండున్నర ఎకరాల పొలంలో అంజీరా పండ్లను సాగు చేశాడు. సాధారణంగా అంజీరా పండ్ల సాగు లాభసాటి అయినా రైతులు మార్కెట్ లో అమ్మడం వల్ల నష్టపోతూ ఉంటారు. తను కూడా అలా నష్టపోకూడదని భావించి అతను కొన్ని సూపర్ మార్కెట్లతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అంజీరా పండ్లను పవిత్రక్ పేరుతో కిలో బాక్సుల చొప్పున విక్రయించాడు.
ఊహించని విధంగా పవిత్రక్ పేరుతో అతను చేసిన వ్యాపారం సక్సెస్ అయింది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా అతని పండ్లకు ఆర్డర్లు వచ్చాయి. ప్రస్తుతం సమీర్ నెలకు 13 లక్షల రూపాయలు సంపాదిస్తూ కోటిన్నర టర్నోవర్ తో వార్తల్లో నిలిచాడు. ఒకప్పుడు అతనిని విమర్శించిన వాళ్లే ఇప్పుడు అతని నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు.
































