టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ తన మనసులోని బాధను, తండ్రి మోహన్‌బాబుపై ఉన్న ప్రేమను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తొమ్మిదేళ్లుగా తన జీవితంలో చోటుచేసుకున్న సంఘటనల గురించి, కుటుంబంలో తలెత్తిన విభేదాల గురించి ఆయన మాట్లాడారు.

“నాన్న కాళ్లు పట్టుకోవాలని ఉంది… కానీ” అంటూ మనోజ్ తన ఆవేదనను వ్యక్తం చేశారు. తన కూతురిని తాతయ్య ఒడిలో చూడాలని ఉన్నా, కొన్ని పరిస్థితులు తనను వెనక్కి లాగుతున్నాయని ఆయన అన్నారు.
మనోజ్ మాట్లాడుతూ, “నేను తొమ్మిదేళ్లుగా నా పని చేసుకుంటున్నాను. నా భార్య సొంతంగా బొమ్మల కంపెనీ పెట్టింది. నేను ఆర్ట్ వర్క్ చేశాను, కథలు రాశాను. ఎంతో ఆత్మగౌరవంతో బతికాం. కానీ, ఊహించని విధంగా మాకు కష్టాలు వచ్చాయి. అప్పుడు నేను మీడియా ముందుకు రావాల్సి వచ్చింది” అని అన్నారు.
భార్య గర్భవతిగా ఉన్న సమయంలో కుటుంబ సభ్యులంతా కలిశామని, అది కొందరికి నచ్చలేదని మనోజ్ తెలిపారు. అంతేకాకుండా, కాలేజీలోని సమస్యల గురించి విద్యార్థులు తనకు ఉత్తరాలు రాశారని, దానిపై స్పందించినందుకు తనను ప్రశ్నించారని ఆయన చెప్పారు.
భార్యపై కేసులు, మనోజ్ మనోవేదన:
“అక్కడ పనిచేసే వారందరితో నాపైనా, నా భార్యపైనా కేసులు పెట్టించారు. అసలు సంబంధం లేని విషయాల్లోకి తనను లాగారు. అప్పుడు నా గుండె పగిలిపోయింది. తను నాకు అన్నీ! నేను ఎలాంటి తప్పు చేయలేదు. కానీ, మమ్మల్ని ఇబ్బంది పెట్టారు” అని మనోజ్ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు కోపం వచ్చినా, తండ్రిపై ఉన్న ప్రేమతో మౌనంగా ఉన్నానని ఆయన అన్నారు.
“వెళ్లి నాన్న కాళ్లు పట్టుకోవాలని, నా పాపను ఆయన ఒడిలో పెట్టాలని ఇప్పటికీ ఉంది. కానీ, నేను తప్పు చేయనప్పుడు క్షమాపణ ఎలా చెప్పను? అలా చేస్తే, నా పిల్లలకు ఏం నేర్పిస్తాను? మా నాన్నే నాకు నీతి, నిజాయితీ నేర్పించారు. అందుకే నేను వెనక్కి తగ్గలేకపోతున్నాను” అని మనోజ్ అన్నారు.
కుటుంబ సభ్యులంతా మళ్లీ కలిసి ఉండాలని మనోజ్ రోజూ దేవుడిని ప్రార్థిస్తున్నారు. సమస్యలు సృష్టించిన వారు తమ తప్పును తెలుసుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
త్వరలో ‘భైరవం’గా మనోజ్:
మనోజ్ త్వరలో ‘భైరవం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమాకు విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నారు. మే 30న ఈ చిత్రం విడుదల కానుంది.



































