గులాబీ చామంతి విరబూస్తే..అందం అభినయం కలిస్తే మనకు గుర్తుకు వచ్చే పేరే మీనా. బాలనటిగా హీరోయిన్ గా మీనా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయే అనేక పాత్రలు ధరించింది. మొదట తమిళ చిత్రాలను చేసినప్పటికీ 1983లో అంటే సరిగ్గా చిరంజీవి నటించిన బ్లాక్ బస్టర్ ఖైదీ చిత్రం సమయానికి మీనా బాలనటిగా సిరిపురం చిన్నోడు సినిమాతో తో తెలుగు రంగంలోకి అడుగు పెట్టింది. అప్పటికీ ఆ బాల నటికీ కొన్ని సంవత్సరాల తర్వాత మెగాస్టార్ తో సినిమా చేస్తానని ఊహించలేక పోయుండొచ్చు.

దాదాపు పది సంవత్సరాలకు చిరంజీవితో నటించే అవకాశం మీనాని వెతుక్కుంటూ రానేవచ్చింది.ఈ సినిమా కంటే ముందే 1990 లో రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన నవయుగం సినిమా లో మీనా మొట్టమొదటగా హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత సీతారామయ్యగారి మనవరాలు, చంటి,బొబ్బిలి సింహం, అల్లరి మొగుడు, అల్లరి అల్లుడు అలా 1993లో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ముఠామేస్త్రి సినిమాలో చిరంజీవితో నటించే అవకాశం వచ్చింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.

పంజరం, ముత్తు, ముద్దుల మొగుడు, గిల్లికజ్జాలు, సూర్యవంశం చిత్రాల తర్వాత తిరిగి ఆరు సంవత్సరాలకి చిరంజీవితో నటించే అవకాశం మీనాకు వచ్చింది. 1999లో కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో సూర్య మూవీస్ బ్యానర్ లో వచ్చిన స్నేహం కోసం సినిమాలో మీనా చిరంజీవితో జతకట్టింది. ఆ సినిమా కూడా బాక్స్ ఆఫీసు వద్ద విజయాన్ని సాధించింది. ఆ తర్వాత చిరంజీవి మీనా కాంబినేషన్ లో ఇప్పటి వరకు ఏ సినిమా రాలేదు.

2009లో బెంగళూరుకు చెందిన విద్యాసాగర్ అనే ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను మీనా పెళ్లి చేసుకొని సినిమాలను చాలావరకు తగ్గించడం జరిగింది. ఈ మధ్యకాలంలో దృశ్యం, సాక్ష్యం లాంటి సినిమాల్లో తిరిగి రీఎంట్రీ ఇవ్వడంతో ఒక ఇంటర్వ్యూలో చిరంజీవితో నటించే విషయం గూర్చి అడగగా.. తాను చిరంజీవితో నటించడానికి సిద్ధంగా ఉన్నానని అత్త పాత్ర కాకుండా భార్య గా నటించడానికి తనకు ఏ అభ్యంతరం లేదంటూ మీనా చెప్పుకొచ్చారు.
































