ప్రస్తుత జీవనశైలిలో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో సహజ పదార్థాలపై మళ్లీ దృష్టి పెడుతున్నారు చాలా మంది. మన వంటింట్లో సులభంగా దొరికే సుగంధ ద్రవ్యాల్లో ఒకటైన దాల్చిన చెక్క ఆరోగ్యానికి అనేక విధాలుగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా దీన్ని నీటిలో మరిగించి తాగడం ద్వారా కొన్ని సాధారణ సమస్యలను నియంత్రించవచ్చని ఆరోగ్య నివేదికలు సూచిస్తున్నాయి.

దాల్చిన చెక్కలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో వాపును తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణలో ఇది పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్యాంక్రియాస్ పనితీరును ఉత్తేజపరచడం ద్వారా ఇన్సులిన్ ప్రభావాన్ని మెరుగుపరచే లక్షణాలు ఇందులో ఉన్నాయని వివరణలు ఉన్నాయి.
బరువు నియంత్రణలో కూడా ఈ సహజ పదార్థం ఉపయుక్తంగా ఉంటుందని సూచిస్తున్నారు. దాల్చిన చెక్క నీరు జీవక్రియను మెరుగుపరచి శరీరంలో కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గించడంలో తోడ్పడుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో లేదా రాత్రి భోజనం తర్వాత తాగడం వల్ల దీని ప్రయోజనం మెరుగ్గా ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
మహిళల ఆరోగ్యానికి కూడా ఇది ఉపయోగకరమని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. హార్మోన్ల సమతుల్యతలో సహకరించడం వల్ల పీరియడ్స్‌కు సంబంధించిన సమస్యలను కొంతవరకు తగ్గించడంలో దాల్చిన చెక్క సహాయపడవచ్చని చెబుతున్నారు. అయితే ఇది వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదని స్పష్టం చేస్తున్నారు.
నోటి పరిశుభ్రత విషయంలో కూడా దాల్చిన చెక్క పాత్ర ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇందులోని యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు నోటి దుర్వాసన తగ్గించడంలో, దంతాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. చిన్న ముక్కను నమలడం లేదా పొడిని స్వల్పంగా ఉపయోగించడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు.
అయితే వినియోగంలో జాగ్రత్తలు అవసరం. అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో వేడి పెరిగే అవకాశం ఉంటుంది. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు లేదా గర్భిణీలు దీన్ని తీసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే నాణ్యమైన దాల్చిన చెక్కను మాత్రమే ఉపయోగించడం అవసరం.
మొత్తంగా, సరైన మోతాదులో, సరైన విధంగా ఉపయోగిస్తే దాల్చిన చెక్క ఆరోగ్యానికి తోడ్పడే సహజ పదార్థంగా నిలుస్తుంది. అయితే ఏదైనా కొత్త ఆహారపు అలవాటు ప్రారంభించే ముందు నిపుణుల సూచన తీసుకోవడం ఉత్తమం.
































