సినిమా ఇండస్ట్రీ నుంచి దళితులను, షెడ్యూల్ట్ కులాలను గెంటేయాలంటూ సంచలన కామెంట్స్ చేసింది తమిళనాడు హీరోయిన్ మీరా మిథున్. ఇప్పుడు ఈ కామెంట్స్ పెద్ద దుమారం రేపుతున్నాయి. రాజ్యాంగం ప్రకారం దళితులను దూషించడం, ఇతర కులాలను కించపరచడం అనేది నేరం. వారికి శిక్షలు విధించేందుకు కఠిన చట్టాలు కూడా ఉన్నాయి.

అయినా కూడా కొందరు మాత్రం నోరు జారుతూనే ఉంటారు. తమిళనాడు హీరోయిన్ మిథున్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తమిళనాడు ఇండస్ట్రీలో దళితులు, షెడ్యూల్డ్ కులాల నుంచి వచ్చిన దర్శకులు, నటులు చాలా మంది ఉన్నారు. వారిని వెంటనే బయటకు పంపేయాలంటూ ఆ ఇంటర్వ్యూలో తెలిపింది. ఆమెకు తమిళనాట యూ ట్యూబ్ స్టార్ గా మాత్రం పెద్ద గుర్తింపు ఉంది. ఈ కులాల నుంచి వచ్చిన వారి వళ్లే క్వాలిటీ సినిమాలు రావడం లేదంట ఘాటు విమర్శలు చేశారు.
వాళ్ల పద్దతులు, వ్యవహారాలు అసలు బాగుండవని.. అందుకే సినిమాలు మంచిగా రావని చెప్పింది. తన అనుమతి లేకుండా తన ఫొటో తీసుకొని ఓ దర్శకుడు సినిమా ఫస్ట్ లుక్ కోసం వాడారని ఆమె ఆరోపించింది. ఆ దర్శకుడు షెడ్యూల్ట్ కులం నుంచి వచ్చిన వారే అంటూ చెప్పుకొచ్చింది. అంతే కాకుండా సినిమా పరిశ్రమలో పనిచేసే ఆ కులాల వారికి అనేక నేరాలతో కూడా సంబంధం ఉందని.. ఓ వీడియోలో తెలిపింది మీరా మిథున్.
ఆమె చేసిన ఈ సంచలన కామెంట్స్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. ఈమెపై ప్రతీ ఒక్కరూ మండిపడుతున్నారు. దళిత సంఘాలు మాత్రం ఆమె కామెంట్స్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆమెపై తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల కేసులు కూడా నమోదయ్యాయి. సినిమా ఇండస్ట్రీ నుంచి ఆమెనే బయటకు పంపాలనే డిమాండ్లు ఎక్కువ అవుతున్నాయి.































