తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన చిత్రాలకు సంగీతం నిర్వహించి సంగీత దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మ్యూజిక్ డైరెక్టర్ కోటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్నారు. ఇకపోతే తాజాగా కోటి కొడుకు రాజీవ్ హీరోగా వెండితెరకు పరిచయం కాబోతున్నారు.

రాజీవ్ హీరోగా నటి వాణి విశ్వనాథ్ కూతురు వర్ష హీరోయిన్ గా పరిచయం అవుతూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం 11: 11. ఈ క్రమంలోనే ఈ సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ ప్రోగ్రాం నిన్న ఎంతో ఘనంగా జరిగింది. పార్క్ హయత్ హోటల్ లో ఈ కార్యక్రమం ఎంతో వేడుకగా జరగగా ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ క్రమంలోనే మెగాస్టార్ మాట్లాడుతూ ఈరోజు ఎంతో మంచి రోజు ఈ రోజు తన చిత్రం కూడా ప్రారంభం అయిందని, ఆ తర్వాత కోటి కొడుకు హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమా వేడుకకు హాజరు కావడం చాలా సంతోషంగా ఉందని వెల్లడించారు. ఇక కోటి గురించి మాట్లాడుతూ నా విజయం వెనక కోటి హస్తం ఎంతో ఉందని ఆయన పై ప్రశంసలు కురిపించారు.
నేను నటించిన ఎన్నో సినిమాలకు కోటి అద్భుతమైన సంగీతం అందించి ఆ చిత్రాలను విజయవంతం చేశాడని, కోటి రుణం తీర్చుకోలేపోతున్నానని ఈ సందర్భంగా మెగాస్టార్ వెల్లడించారు. అయితే ఇవాళ కోటి కొడుకు రాజీవ్ ను ఆశీర్వదించడం ఎంతో ఆనందంగా ఉందని చిరంజీవి వెల్లడించారు.































