సాధారణంగా మనకు ఎంతో దగ్గరైనా మన కుటుంబ సభ్యులు, మన ఆత్మీయులు మరణించి దూరమైతే వారికి గుర్తుగా వారితో ఉన్న జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ నిరంతరం వారిని గుర్తు చేసుకుంటూ బాధపడుతుంటారు. ఒక్కసారైనా వారితో మాట్లాడాలని ఎంతో మంది భావిస్తుంటారు. అయితే ఇలాంటి వారి కోరికలను మైక్రోసాఫ్ట్ తీర్చ బోతోందా? అంటే దాదాపు అవుననే సమాధానం వినిపిస్తోంది. మైక్రోసాఫ్ట్ కొత్త టెక్నాలజీని ఉపయోగించి చనిపోయిన వారితో మాట్లాడే అవకాశాన్ని కల్పించనున్నట్లు తెలుస్తోంది.

ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా పనిచేసే ఒక చాట్‌బాట్‌ను రూపొందించింది. దీని ద్వారా చనిపోయిన వ్యక్తికు సంబంధించిన డేటా ఆధారంగా తయారు చేస్తారు. అంటే చనిపోయిన వ్యక్తి వాయిస్, వారి డేటా ఫోటోలు వీడియోలను సేకరించిన అనంతరం ఈ చాట్ బాట్ ద్వారా రూపొందిస్తారు. ఈ విధంగా చాట్ బాట్ రూపొందించడం వల్ల అచ్చం చనిపోయిన వ్యక్తి లాగే మాట్లాడుతుంది. అంతే కాకుండా వారికి తెలిసిన వ్యక్తులను కూడా పలకరిస్తుంది. ఈ చాట్ బాట్ కు మరింత టెక్నాలజీని ఉపయోగించి 2 డి,3డీ లో రూపంలో ఫోటోలను కూడా చేర్చవచ్చు.
ఈ విధంగా మైక్రోసాఫ్ట్ తయారుచేసిన కొత్త టెక్నాలజీ ద్వారా చనిపోయిన వ్యక్తులు తమ దగ్గర ఉన్న భావనను కలిగిస్తుంది. అంతేకాకుండా వారితో మాట్లాడుతున్న భావన మనలో కలుగుతుంది. అయితే ప్రస్తుతం ఈ టెక్నాలజీని మైక్రోసాఫ్ట్ అందుబాటులోకి తెస్తుందా? లేక దీనిపై మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందా అనే విషయం గురించి క్లారిటీ తెలియడం లేదు. ఏది ఏమైనా ఈ టెక్నాలజీ మాత్రం అందుబాటులోకి వస్తే ఎంతో మంది తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి కొంతవరకు ఊరటగా ఉంటుందని చెప్పవచ్చు.



































