సినీ ప్రముఖుల విజ్ఞప్తి మేరకే ప్రభుత్వం ఆ నిర్ణయాలను తీసుకుంది.. ఎమ్మెల్యే రోజా

0
1703

గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్ర పరిశ్రమపై తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనంగా మారుతున్నాయి. సినిమా టికెట్ ధరల విషయంలో నిర్మాతలు, యాజమాన్యాలు, ఎగ్జిబీటర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ టికెట్ ధరల విషయంలోనే విసుగుచెంది సినిమాలను థియేటర్లలో రిలీజ్ చేయడం కంటే.. ఓటీటీ లో విడుదల చేయడమే సేఫ్ అని భావిస్తున్నారు నిర్మాతలు. సినీ పరిశ్రమ సమస్యలపై చర్చించేందుకు మెగస్టార్ చిరంజీవికి సీఎం జగన్ నుంచి ఆహ్వానం అందింది.

ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదట్లో మెగస్టార్ తో సహా మరికొంత సినీ ప్రముఖులు సీఎంతో చర్చించనున్నారు. కానీ ఈ లోపే ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. సినిమా టికెట్లను ప్రభుత్వమే ఆన్ లైన్ లో విక్రయించేలా నిర్ణయం తీసుకున్నారు. నాలుగు రోజుల క్రితం మంత్రి పేర్నినాని దీనిపై అధికారికంగా కూడా ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

అయితే కొంత మంది ఈ నిర్ణయం ఆమోదయోగ్యంగా ఉందని కొందరు అంటుంటే.. మరికొందరు ఈ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. ఇదిలా ఉండగా.. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయాలవైపు మళ్లింది. ప్రభుత్వం టికెట్లను, మద్యాన్ని అమ్ముకుంటుందని విమర్శలు చేస్తున్న క్రమంలో ఎమ్మెల్యే రోజా దీనిపై తీవ్రంగా స్పందించారు.

ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. సినీ ప్రముఖులు ఆన్ లైన్ లోనే టికెట్లు అమ్మాలని సీఎంను కోరడంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని.. అంతేగానీ దీనిపై మరే ఉద్దేశ్యం లేదంటూ రోజా స్పష్టం చేశారు. ఇక త్వరలో సీఎం జగన్ తో సినీ సమస్యలపై మీటింగ్ జరగనున్న నేపథ్యంలో.. ఏ విషయాలపై చర్చించుకుంటారో.. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అనే ఉత్కంఠ పెరుగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here