ఎవరైనా ఏదన్న తిక్క పని చేస్తే ఏంట్రా.. ఆ కోతి పనులు అని అంటుంటారు పెద్దలు. ఇలా కోతులు చేసే పనులు అంతా విచిత్రంగా ఉంటాయి. అంతేకాకుండా కోతులు ఏదైనా ఆహారం దొరికిందంటే చాలు.. చెట్టెక్కి కూర్చొని తింటాయి. వీటి వల్ల ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. పిల్ల కోతులకు ఏమైనా జరిగితే దగ్గర్లో ఉన్న మనుషులపై కోతులు ఎగబడి గాయపరుస్తాయి. అయితే ఈ కోతులకు సంబంధించి ఉత్తరప్రదేశ్‌లో ఓ వింత సంఘటన జరిగింది.

ఉత్తర ప్రదేశ్‌లోని హార్దోయి జిల్లాలోని సాంఢీ పోలిస్ స్టేషన్ పరిధిలో రోడ్డు పక్కన నిలిపి ఉన్న బైక్ నుంచి రూ.మూడు లక్షల బ్యాగ్‌ను ఎత్తుకొని వెళ్లి చెట్టుమీద కూర్చుంది ఓ కోతి. విషయం గమనించిన బైక్ యజమాని ఆశిష్ సింగ్ తన బ్యాగ్ ఇచ్చేయమని కోతిని బతిమిలాడాడు. అవి మనుషులా.. చెబితే వినడానికి కాదు కదా.. అతడు ఎన్ని సైగలు చేసినా వాటికి అర్థం కావు. కానీ అతడు బ్యాగ్ ను ఇవ్వమని ఎంత చెప్పినా అది వినిపించుకోలేదు.
వెంటనే ఆశిష్ సింగ్ దగ్గరలో ఉన్న సాంఢీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. తన బైక్ నుంచి కోతి మూడు లక్షల రూపాయల బ్యాగ్ కొట్టేసిందని ఫిర్యాదు చేశాడు. అతడు అలా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి వెళ్లాడో లేదో.. ఇలా ఆ కోతి తన చేతిలోని డబ్బుల బ్యాగును కింద పడేసింది. అక్కడే ఉన్న సెక్యూరిటి గార్డ్ ఆ బ్యాగ్ దగ్గరకు వెళ్లి చూశాడు.
అందులో డబ్బులు ఉన్న విషయం గమనించాడు. వెంటనే ఆ డబ్బులు ఉన్న బ్యాగ్ ను తీసుకొని వెళ్లి పోలీస్‌స్టేషన్‌లో అప్పగించాడు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నిజాయితీగా ఆ డబ్బుల బ్యాగును తీసుకొని వచ్చి పోలీసులకు అప్పగించిన ఆ సెక్యూరిటీ గార్డును పోలీసులు మెచ్చుకున్నారు. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అతడి నిజాయితీని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

































