MS Raju : దేవి, వర్షం, ఒక్కడు, నువ్వొస్తానంటే నేనోద్ధాంటానా వంటి వరుస హిట్లతో వరుస ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్న నిర్మాత ఎంఎస్ రాజు గారు సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ ద్వారా అభిరుచి గల నిర్మాత. ఆయన బ్యానర్ లో సినిమా అంటే కచ్చితంగా కథ బాగుంటుంది అనేంతలా ఆయన మార్క్ వేసుకున్నారు. వరుస సక్సెస్ లు చూసిన ఎంఎస్ రాజు గారు ఆ తరువాత వరుస ఫ్లాప్స్ అందుకుని ప్రస్తుతం చిన్న సినిమాలను తీస్తున్నారు. ఇక డైరెక్టర్ గా మారి ‘డర్టీ హరి’ అనే బోల్డ్ అటెంప్ట్ చేసిన ఎంఎస్ రాజు గారు ఇటీవల కొడుకు సుమంత్ అశ్విన్ హీరోగా ‘సెవెన్ డేస్ సిక్స్ నైట్స్’ సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం చిన్న సినిమాలకు పరిమితమైన ఎంఎస్ రాజు గారు ఆయన అనుభవాలను ఇటీవల పలు ఇంటర్యూలలో పంచుకున్నారు.

ఆ సినిమా రోడ్డు మీద నిలబెట్టింది…
ఏంఎస్ రాజు గారు విద్యాభ్యాసం హైదరాబాద్, గుడివాడలో జరిగినా డిగ్రీకి వచ్చేసరికి మద్రాస్ లో పూర్తి చేసారు. ఇక పీజీ కూడా అక్కడే చదివిన ఆయన చదువుయ్యాక తండ్రి అప్పటికే నిర్మాత కావడం వల్ల తను సినిమా నిర్మాణ రంగంలో అడుగుపెట్టాలని భావించి సొంత ప్రొడక్షన్ హౌస్ ను అనతి కాలంలో స్టార్ట్ చేశారు. ఇక అలా సినిమాలను తీస్తున్న సమయంలో కొన్ని సినిమాలు పర్వాలేదనిపించినా మరికొన్ని మాత్రం బాగా ఆర్థిక ఇబ్బందులను తెచ్చాయంటూ చెబుతారు ఏంఏస్ రాజు. అలా పూర్తిగా దివాళా తీసింది మాత్రం ఆయన నిర్మించిన ‘స్ట్రీట్ ఫైటర్’ సినిమాతోనే అంటూ చెప్పారు.

స్ట్రీట్ ఫైటర్ సినిమా మిగిల్చిన నష్టాలతో నా కుటుంబం స్ట్రీట్ మీదకి వచ్చేయాల్సిన పరిస్థితి అంటూ చెప్పారు. ఆ సినిమా తరువాత స్నేహితుల వద్ద తెలిసిన వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుని ‘దేవి’ సినిమా తీయగా ఆ సినిమా మళ్ళీ పోయిన వాటన్నింటిని తెచ్చిపెట్టిందంటూ తెలిపారు. అయితే అప్పటికే హీరో వెంకటేష్ మంచి మిత్రుడని అడిగితే సినిమా చేస్తాడని తెలిసినా ఫ్లాప్ లో ఉన్నపుడు అడిగి సహాయం తీసుకోకూడదని భావించి రాజు అడగలేదట. అయితే దేవి మొదటి ప్రింట్ చూసిన వెంకటేష్ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా మనం నెక్స్ట్ సినిమా చేద్దాం నీకు ఇష్టమైతే నాకు నీ గట్స్ ఇష్టం అంటూ చెప్పారట. దేవి సినిమా బాగా వచ్చింది సక్సెస్ అవుతుంది అంటూ చెప్పారట వెంకీ.
































